ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచకుండా.. వైన్‌ షాపుల్లో రిజర్వేషన్లేంది?

ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచకుండా.. వైన్‌ షాపుల్లో రిజర్వేషన్లేంది?
  • దళితులకు వంద ఎకరాలిచ్చి.. వేల ఎకరాలు గుంజుకుంటున్రు
  • హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్రు: సీతక్క
  • ధరణితో రైతులకు న్యాయం జరగట్లేదని ఆరోపణ
  • ధరణిపై హైకోర్టులో పిటిషన్ వేస్తం: రాజనర్సింహ

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌‌‌‌లో అనేక లోపాలు ఉన్నాయని, దీంతో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అఖిలపక్ష నేతలు అన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌లో జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ధరణి సమస్యలపై రౌండ్ టేబుల్ మీటింగ్ శనివారం నిర్వహించారు. ధరణి సమస్యలు ప్రతిరోజూ తమ దృష్టికి వస్తున్నాయని, ధరణితో పేద రైతులకు న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కేసీఆర్ సర్కార్ దళితులకు 100 ఎకరాలిచ్చి, వేల ఎకరాలు గుంజుకుంటోందని ఆరోపించారు. హరితహారం పేరుతో పోడు భూములను బలవంతంగా లాక్కుంటోందని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులన్నీ ఏకమైతే కేసీఆర్‌‌‌‌ను గద్దె దించడం సాధ్యమవుతుందన్నారు. అధికార పార్టీ నేతలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఎక్కువ భూమి చూపించుకొని రైతుబంధు తీసుకుంటున్నారని.. కౌలు, పోడు రైతులకు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచకుండా, వైన్స్‌‌‌‌లో రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ధరణి వెనుక కేసీఆర్ కుట్ర ఉందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆరోపించారు. సమగ్ర భూ సర్వే చేయకుండానే ధరణి తీసుకొచ్చారని మండిపడ్డారు. ధరణి, రాచకొండ భూములు, ఎక్స్‌‌సస్‌‌న్ భూముల సమస్యలపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు.

ఎవరి కోసం ధరణి: డీకే అరుణ

ధరణి పోర్టల్ ఎవరి కోసం తెచ్చారో అర్థం కావడం లేదని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ధరణిలో అనేక సాంకేతిక సమస్యలున్నప్పటికీ, ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. భూముల సమగ్ర సర్వే చేయకుండా ధరణిలో చేర్చడం సరికాదని సీపీఎం నాయకురాలు పశ్య పద్మ అన్నారు. టెక్నాలజీ పెరిగినా, భూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.