బెంగాల్లో డబ్బులతో దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు

బెంగాల్లో డబ్బులతో దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు

పశ్చిమ బెంగాల్లో డబ్బులతో దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కశ్యప్, నమన్‌ బిక్సల్‌ కొంగరిలు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. బెంగాల్‌లోని హౌరాలో డబ్బు కట్టలతో  పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో.. ముగ్గురిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని.. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని జార్ఖండ్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అవినాశ్‌ పాండే ప్రకటించారు. 

బ్లాక్ కార్ లో పెద్ద మొత్తంలో డబ్బుల తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో..హౌరా జిల్లా రాణిహటి హైవేపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో బెంగాల్ నుంచి వస్తున్న కారును ఆపి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా డబ్బు బయటపడింది. ఈ నగదు మొత్తం  జార్ఖండ్‌ కు చెందిన  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు  నమన్‌ బిక్సల్‌ కొంగరి, ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్ దిగా పోలీసులు గుర్తించారు.  కారులో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించారు. 

పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బుల కట్టలతో పట్టుబడటం సంచలనంగా మారింది. హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు  బీజేపీ కుట్ర పన్నిందని జార్ఖండ్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఏఐసీసీ సభ్యుడు అవినాష్ పాండే  ఆరోపించారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, బలహీనపరిచేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పాండే అన్నారు. కొన్ని నెలల క్రితం కొంతమంది ఎమ్మెల్యేలను సంప్రదించినందుకు బీజేపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణం ప్రభుత్వం సుస్థిరంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పారు.