- కేటీఆర్కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల భూముల అమ్మకాలపై చర్చకు కేటీఆర్ సిద్ధమా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీలో స్థలాలు ఖాళీగా ఉన్నప్పుడు కలెక్టర్లు సహజంగా నోటీసులు ఇస్తారని, ఉర్దూ వర్సిటీకి కూడా అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖ ఇచ్చారని తెలిపారు.
దానిపై వర్సిటీ ఇచ్చిన సమాధానం తర్వాత కలెక్టర్ తన లేఖను ఉపసంహరించుకున్నారని వివరించారు. కలెక్టర్ స్పష్టత కూడా ఇచ్చారని, అయినా విద్యార్థులను రెచ్చగొట్టేందుకు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కు ఎందుకింత కడుపుమంట అని ఫైర్ అయ్యారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే నోరువిప్పని కేటీఆర్..ఇప్పుడు వారిని రెచ్చగొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుండని దుయ్యబట్టారు.
