రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

జగిత్యాల జిల్లా: రాష్ట్రంలో  కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ పేరుతో పిలిచినా సెప్టెంబర్ 17 అనేది నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని స్పష్టం చేశారు. నిజాం పాలనలో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని తెలిపారు. తనకు ఎదురు తిరిగిన వారిని నిజాం రాజు క్రూరంగా హింసించి చంపారన్నారు. నిర్మల్ లో  నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన 1000 మందిని మర్రి చెట్టుకు ఉరి తీసి చంపించారని తెలిపారు. ఆనాటి పీఎం నెహ్రూ ఆదేశాలతో సర్దార్ పటేల్ సైనిక చర్యలకు దిగి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారని గుర్తు చేశారు.

అప్పటి కాంగ్రెస్ నేతలు స్వామి రామానంద తీర్థ, కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. అలాగే రాంజీ గోండు, కొమురం భీమ్, రావి నారాయణ రెడ్డి, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి నాయకులు నిజాం పాలనను అంతం చేసేందుకు కృషి చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముల్కీ రూల్స్ అమలు చేయాలని అప్పటి కాంగ్రెస్ నేతలు అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు. సెప్టెంబర్ 17 అనేది రాష్ట్ర చరిత్రలో గొప్ప రోజని, అలాంటి రోజుకు కొన్ని పార్టీలు మతం రంగు పులుముతున్నాయని మండిపడ్డారు. 

కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుండు

సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ విద్యను దూరం చేస్తున్నారన్న జీవన్ రెడ్డి... ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులివ్వడం అందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యం అని జీవన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.