వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలనుకోవడం తప్పుడు నిర్ణయం

వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలనుకోవడం తప్పుడు నిర్ణయం

వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలనుకోవడం తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మహిళా వీఆర్ఏలకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వరా..? అని ప్రశ్నించారు. వీఆర్ఏలవి కోర్కెలు కాదు.. వారి డిమాండ్లు అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను రెండేళ్లు ఇబ్బందులకు గురి చేయడంతో న్యాయస్థానం చొరవతో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందన్నారు. వీఆర్ఏలకు అండగా ఉంటామని చెప్పారు. వీఆర్ఏలు చేసే ఏ పోరాటానికైనా తాము సిద్ధంగా ఉంటామన్నారు. VRAలు చేపట్టిన సమ్మెకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలో మద్దతు తెలిపారు. 

వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోలు స్పందించకపోవడం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖకు వీఆర్ఏలు మూల స్థంబాలన్నారు. వీఆర్ఏల బలవన్మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదా..? అని ప్రశ్నించారు. వీఆర్ఏల త్యాగాలను విస్మరించి..నియంత ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. శాసనసభ సమావేశాలు కొనసాగేందుకే వీఆర్ఏలను శాంతింపజేశారని అన్నారు. డిమాండ్ల గురించి మాట్లాడకుండా చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.