కాంగ్రెస్ హయాంలోనే దేశాభివృద్ధి

 కాంగ్రెస్ హయాంలోనే దేశాభివృద్ధి

జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశాభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ పాలనలో దేశం తిరోగమిస్తోందని ఆరోపించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం పాత బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్య్రం కోసం  ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులను అందించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.  దేశం స్వయం సమృద్ధి సాధించిందంటే ఆ ఘనత నాటి ప్రధాని నెహ్రూదేనన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో హరిత విప్లవం సాధించిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. ఇప్పుడేమైనా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటే అవన్నీ యూపీఏ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినవే అని స్పష్టం చేశారు. తమకు అధికారం ముఖ్యం కాదన్న  జీవన్ రెడ్డి... పేదల సంక్షేమ తమ పార్టీ ధ్యేయమని తేల్చి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్, మోడీ ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్ముతున్నాయన్న ఆయన... ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆస్తులను అమ్మే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఏమైందన్న జీవన్ రెడ్డి... ఇప్పటివరకు మోడీ ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో విద్య  ప్రైవేట్ పరమైందన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో రాష్ట్ర నిరుద్యోగులకు ప్రాధాన్యం లేకుండా పోయిందని చెప్పారు. దళిత, గిరిజనుల సొమ్ము కాజేసిన కేసీఆర్... ఇవాల దళిత బంధు నాటకమాడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీల అభివృద్ధి కోసం గత ఐదేళ్లలో రూ.56 వేల కోట్లు కేటాయిస్తే... ఖర్చు చేసింది రూ. 26 వేల కోట్లు మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే మిగతా 30 వేల కోట్లతో దళితులకు 6 లక్షల ఇల్లు నిర్మించి ఇవ్వాలని సవాల్ విసిరారు.  మద్ధతు ధర రాకపోవడంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా మద్ధతు ధర ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ చేసిన త్యాగం ఏంటో చెప్పాలన్న ఆయన... రాజకీయంగా తమకు నష్టం కలుగుతుందని తెలిసినా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు.