
- కేటీఆర్, హరీశ్ కు చామల సవాల్
- సలహాలు ఇవ్వాలంటే.. సర్కారును బద్నాం చేస్తున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విడుదల చేసిన రెండు మేనిఫెస్టోలు, పది నెలల కాంగ్రెస్ పాలనలో తెచ్చిన మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుకు కాంగ్రెస్ నేత, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో ఎంపీ మాట్లాడారు. ప్రజలకు మంచి పాలన అందించేందుకు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని అన్ని పార్టీల నేతలను సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని, కానీ.. బావాబామ్మర్దులు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని, ఆ పదవి కోసమే వారిద్దరూ పోటీపడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను తెలంగాణ కోసం కాకుండా.. కమీషన్లు, కలెక్షన్ల కోసమే ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పదిసార్లు కూడా సెక్రటేరియెట్కు పోలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి రోజూ సచివాలయానికి వెళ్లడమే కాకుండా అన్ని పార్టీల నేతలకూ అపాయింట్మెంట్ ఇస్తున్నారని చెప్పారు.
ఏలేటిని మేమే పక్కన పెట్టినం
ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నపుడు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి గాంధీ భవన్ లో ప్రత్యేక చాంబర్ ఇచ్చామని చామల తెలిపారు. అయితే, కలెక్షన్స్ బాగా చేస్తున్నారని పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు రావడంతో తామే పక్కన పెట్టామన్నారు. బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచినా లాభం లేకుండా పోయిందని, కాంగ్రెస్ లో ఉంటే మంత్రి అయ్యేవాడినని ఆయన చెప్పుకుంటున్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి పదేండ్లపాటు సీఎంగా ఉంటారని, ఇందులో ఎవరికీ సందేహాలు అక్కర్లేదన్నారు