మునుగోడు బై పోల్ హీట్ కొనసాగుతోన్న టైంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. మునుగోడులో తాను ప్రచారం చేసినా చేయకపోయినా కాంగ్రెస్ గెలవదని అభిప్రాయపడ్డారు. తాను ప్రచారానికి వెళ్తే మహా అయితే మరికొన్ని ఓట్లు పడతాయే తప్ప పార్టీ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకట్ రెడ్డి అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, తన అభిమానులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
25 ఏండ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను ఇప్పటికి 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఎంపీగా కొనసాగుతున్నాని అది చాలని వెంకట్ రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలతో కొట్లాడుతూ ఏం అభివృద్ధి చేయగలమని ప్రశ్నించారు. పాదయాత్ర చేసే ఉద్దేశమున్నా కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలతో అది సాధ్యపడటంలేని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న వెంకట్ రెడ్డి ప్రత్యర్థి పార్టీల స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం ఆస్ట్రేలియా వెళ్లారు. ఎలక్షన్ పూర్తైన తర్వాత ఆయన భారత్కు తిరిగిరానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ వెంకట్ రెడ్డి చెప్తున్న ఆడియో ఇప్పటికే వైరల్గా మారింది. సొంత పార్టీ నాయకుడితో ఫోన్ లో మాట్లాడిన ఆయన.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని చెప్పారు. అలా చేస్తే తానే పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు. పార్టీలను చూడొద్దని, రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలని కోరారు.
