కేంద్రం అసమర్థత, అవినీతికి నిదర్శనం : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

కేంద్రం అసమర్థత, అవినీతికి నిదర్శనం : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
  • బిహార్​లో ఎస్ఎస్​సీ పరీక్షల రద్దుతో రాహుల్ గాంధీ విమర్శలు 

న్యూఢిల్లీ: బిహార్​లోని కొన్ని కేంద్రాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్​సీ) పరీక్షలను రద్దు చేయడంతో కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. పరీక్షల్లో ఇటువంటి అక్రమాలు.. కేంద్రం అసమర్థత, అవినీతి, పరీక్షా మాఫియాలతో ఉన్న సంబంధాల ఫలితమని ఆరోపించారు. టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ కారణాలతో కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను రద్దు చేస్తునట్టు ఎస్ఎస్ సీ ప్రకటించిందని వచ్చిన మీడియా రిపోర్టులను ఆయన ట్వీట్​కు జోడించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ లో రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. ‘‘ఎస్ఎస్ సీ ఫేజ్–13 పరీక్షలో బయటపడుతున్న అవకతవకలు కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు. ప్రధాని మోదీ ప్రభుత్వ కుళ్లిపోయిన వ్యవస్థకు ప్రతిబింబం. సిస్టమ్ లోని లోపాల కారణంగా, నిరంతర పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో లక్షలాది మంది యువత సమయం, ఆశలు వృథా అవుతున్నాయి.

 గత పదేండ్లలో నీట్, యూజీసీ–నెట్, యూపీపీఎస్ సీ, బీపీఎస్ సీ, బోర్డు పరీక్షలతో సహా 80కిపైగా పేపర్లు రిగ్గింగ్ అయ్యాయి. ఇలాంటి అవకతవకలతో ఈ ఏడాది 85 లక్షల మంది యువత జీవితాలు ప్రభావితమయ్యాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. రిక్రూట్ మెంట్ పరీక్షల్లో పారదర్శకత, సంస్కరణల గురించి ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు బూటకమని నిరూపితమైంది” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.