ఆదిలాబాద్, బోథ్​ నియోజకవర్గాల్లో ..కాంగ్రెస్​లో కొత్త ముఖాలు

ఆదిలాబాద్, బోథ్​ నియోజకవర్గాల్లో ..కాంగ్రెస్​లో కొత్త ముఖాలు
  • బోథ్​లో ఏకంగా ఆరుగురు కొత్త నేతల అప్లై
  • ఆదిలాబాద్ నుంచి నలుగురి దరఖాస్తు
  • ముగ్గురిలో ఎవరికైనా ఒకే అంటున్న సీనియర్లు 
  • సీనియర్లు, జూనియర్ల మధ్య మొదలైన లొల్లి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ కాంగ్రెస్ లో కొత్త నేతలు తెరపైకి వస్తున్నారు. ఆదిలాబాద్, బోథ్ రెండు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానం దరఖాస్తులు స్వీకరిస్తుండగా రెండు చోట్ల కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి. ఇందులో సీనియర్ల కంటే జూనియర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు బోథ్ నియోజకవర్గం నుంచి ఏడుగురు అప్లై చేసుకోగా వారిలో ఆరుగురు కొత్త ముఖాలు కావడం గమనార్హం. ఆదిలాబాద్ నుంచి నలుగురు టికెట్​ రేసులో నిలిచారు. వీరంతా టికెట్​ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కందికి టికెట్​ ఇవ్వొద్దంటున్న సీనియర్లు

ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. ఈముగ్గురు కలిసికట్టుగా వెళ్లి అప్లై చేసుకోవడం విశేషం. టికెట్ ఇస్తే తమలోనే ఎవరికైనా ఇవ్వాలని.. పార్టీలో ఈమధ్య చేరిన పారాచూట్ లీడర్లకు ఇస్తే మద్దతు తెలుపమంటూ అధిష్టానానికి స్పష్టం చేస్తున్నారు.

ఇటీవలే పార్టీలో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వకూడదని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి అండదండలున్న కంది శ్రీనివాస్ టికెట్​పై ధీమా వ్యక్తం చేస్తూ ఒంటరిగానే వెళ్తున్నారు. అయితే సీనియర్లను కాదని కందికి టికెట్​ ఇస్తే నేతలు పార్టీ మారే అవకాశాలు లేకపోలేదు. సీనియర్ల వెంట ఉన్న పార్టీ కేడర్ కూడా కాంగ్రెస్ చేయిజారే ప్రమాదం ఉంది. ఇప్పుడిప్పుడే పార్టీ పూర్వ వైభవం కోసం అధిష్టానం ఆరాటపడుతుంటే సీనియర్‍.. జూనియర్ల మధ్య వర్గపోరు కారణంగా ఏం జరుగుతుందో ఏమోనని పార్టీ కార్యకర్తలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

అధిష్టానానికి తలనొప్పి

ఏది ఏమైనప్పటికీ టికెట్ కోసం ఈ నలుగురు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఒకరిద్దరు మాత్రమే పోటీకి ముందుండగా వారిలో అసమ్మతి నేతలను బుజ్జగించి పార్టీ ముందుకెళ్లింది. ఇప్పుడు కాంపిటీషన్​ పెరగడంతో టికెట్​విషయం అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. నలుగురు అభ్యర్థుల్లో మైనార్టీ, బీసీ, రెడ్డి సాజికవర్గం నేతలు ఉన్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సాజిద్ ఖాన్​కు టికెట్ ఇవ్వాలంటూ మైనార్టీ నేతలు కోరుతున్నారు. కాదు తమ నేతకే ఇవ్వాలని సుజాత, సంజీవరెడ్డి వర్గాలు డిమాండ్​ చేస్తున్నాయి.

ఒక్కరు మినహా మిగతా వారంతా..

బోథ్ నియోజకవర్గంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. ఇక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్న ఏడుగురిలో ఒక్కరు మినహా ఆరుగురు పార్టీకి కొత్త నేతలే. ఏఐసీసీ మెంబర్ నరేశ్ జాదవ్ ఒక్కరే గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్లై చేసుకున్న వారిలో ఆడె గజేందర్ గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్​లో చేరి ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు. ఇచ్చోడకు చెందిన నేత కుమ్ర కోటేశ్వర్​కు గతసారి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఎన్సీపీ నుంచి పోటీ చేశారు.

రెండేళ్ల క్రితం మళ్లీ కాంగ్రెస్​లో చేరి ఈసారి కూడా దరఖాస్తు చేసుకున్నారు. నేరడిగొండ మండలం బుగ్గారం సర్పంచ్ జాదవ్ వసంత్ తోపాటు నేతలు డాక్టర్ వన్నెల అశోక్, జల్కే పాండురంగ్, దౌలత్​రావు సైతం కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఆ పార్టీ లీడర్లే కాకుండా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్ సైతం కాంగ్రెస్​టికెట్​కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడుగురిలో ముగ్గురు సీనియర్లు ఉండగా మిగతా నలుగురు ఇతర పార్టీల నుంచి వచ్చినవారే. ఈ క్రమంలో అధిష్టానం ఎవరిమీద దయచూపుతుందోనని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.