- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి వెల్లడి
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధిని చూసి ఓర్వలేక, బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతోందనే భయంతో తుమ్మల తనయుడు, రాష్ట్ర నాయకుడు యుగంధర్ పై పువ్వాడ అజయ్కుమార్ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ విత్తన గిడ్డంగి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సిటీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, మేయర్ నీరజతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
మంత్రి తుమ్మల తనయుడు యాగంధర్ షాడో మంత్రి, ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని అజయ్ కుమార్ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తుమ్మల తనయుడు పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడాన్ని జీర్ణించుకోలేక పువ్వాడ అవాకులు, చవాకులు పేల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునాథ పాలెం మండల అభివృద్ధి పువ్వాడ హయాంలో జరిగిందని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధిలో తుమ్మల మార్కు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. శాంతి భద్రత పనులకు విఘాతం కలిగించే పనులను మంత్రి ఎప్పుడు ప్రోత్సహించలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. పువ్వాడ అజయ్ హంస కంపెనీ పేరుతో తన కొడుకును బినామీగా పెట్టి ఖమ్మంలో కాంట్రాక్ట్ పనులన్నీ దక్కించుకున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు కమర్థపు మురళి, విజయ నిర్మల, నాగులు మీరా పాల్గొన్నారు.
