లోక్‌సభ ఎన్నికల వేళ కొత్త వివాదం తెరపైకివచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 ఫేక్ అకౌంట్లను రద్దు చేశామని ఫేస్బుక్ సంస్థ ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఎఫ్బీ ప్రకటనతో విబేధించింది. తమ వాలంటీర్ల పేజీలన్నీ సేఫ్‌గా ఉన్నాయని, దీనిపై ఎఫ్‌బీని వివరణ కోరతామని పేర్కొంది. ఇక బీజేపీఫేస్ బుక్ చర్యను చరిత్రాత్మక ముందడుగుగా కీర్తించింది. ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నతానియెల్ గ్రెయిషర్ సోమవారం చేసిన ప్రకటనతో ఈ వివాదం మొదలైంది. ఫేక్ అకౌంట్లు సృష్టించి, వేర్వేరు గ్రూపుల్లో చేరి, పదే పదే ఎన్నికల అంశాలను ప్రస్తావించడం, ఎంపీ అభ్యర్థులపై అభిప్రాయాలు సేకరించడం, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం తదితర చర్యలకు పాల్పడుతుండటాన్ని గుర్తించామని, ఆరా తీయగా ఆ అకౌంట్లన్నీ కాంగ్రెస్ ఐటీ విభాగంలో పనిచేస్తున్న వారికి సంబంధించినవిగా తేలిందని నతానియెల్ మీడియాకు తెలిపారు. అయితే, ఐడీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టే అకౌంట్లు రద్దుచేశాం తప్ప కంటెంట్ విషయంలో ఎలాంటి అభ్యం తరాలులేవని పేర్కొన్నారు. ఎన్ని కల్లో అనుచిత లబ్దికి సోషల్ మీడియా వేదిక కారాదన్న లక్ష్యానికి సంస్థ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అకౌంట్లతోపాటు పాకిస్థాన్ ఆర్మీ అక్రమంగా నిర్వహిస్తున్న మరో 103ఫేక్ అకౌంట్లను కూడా రద్దుచేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ను సంప్రదించాం..
అన్‌ఎథికల్ అకౌంట్లను గుర్తించిన తర్వాత కాంగ్రెస్ ఐటీ సెల్ ప్రతినిధులను సంప్రదించామని, అయితే గుర్తింపును వెల్లడించేందుకు వాళ్లు నిరాకరించారని నతానియెల్ చెప్పారు. ‘‘ఈ పేజీలన్నీ మా సంస్థవిధానాల్ని ఉల్లంఘించాయి. నకిలీ అకౌంట్లు , ఒకే పేరుతో వేర్వేరు అకౌంట్లు నిర్వహిస్తున్నారు. మాల్వేర్ కు లింకుల్ని పోస్ట్ చేయడం, యాక్టీవ్‌గా ఉన్న ఇతర గ్రూపుల్లో చేరి భారీ ఎత్తున కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా వాటికి అనుబంధంగా ఉన్న వెబ్సైట్లకు ట్రాఫిక్ పెంచుతున్నారు. ట్రాఫిక్ పెరగడం ద్వారా యాడ్ల రూపంలో భారీ మొత్తంలో డబ్బును దండుకుంటున్నారు’’అని వివరించారు.
