ఓరుగల్లుపై కాంగ్రెస్ గురి .. ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రత్యేక దృష్టి

ఓరుగల్లుపై కాంగ్రెస్ గురి .. ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రత్యేక దృష్టి
  • సీఎం రేవంత్​రెడ్డి డైరెక్షన్ లో కడియం ఫ్యామిలీ అడుగులు
  • లీడర్లు, కార్యకర్తలతో ఎక్కడికక్కడ సమావేశాలు
  • ఎమ్మెల్యేలు, అసంతృప్త నేతల మద్దతు కూడగట్టి ముందుకు..
  • గ్రౌండ్ వర్క్ చేస్తున్న కమలం పార్టీ
  • అభ్యర్థుల వేటలోనే బీఆర్​ఎస్
  • హీటెక్కుతున్న వరంగల్ ​రాజకీయాలు

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ను ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పార్లమెంట్ సీటుపై కన్నేసింది. ఇప్పటికే కడియం శ్రీహరి ఎంట్రీతో పార్టీ మరింత బలం పుంజుకోగా, వరంగల్ ఎంపీ స్థానాన్ని దక్కించుకునే దిశగా అధిష్ఠానం సీరియస్ గా వర్క్​ చేస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సమావేశమై దిశా నిర్దేశం చేస్తున్నారు. కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు, వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ప్రచారంలో స్పీడ్ పెంచారు.

ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్ల సపోర్ట్ తో ముందుకెళ్తుండగా, బీజేపీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి మీటింగులు నిర్వహిస్తోంది. ఇక బీఆర్​ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో తెలియని పరిస్థితుల్లో తికమకపడుతోంది.

సీఎం డైరెక్షన్.. కడియం యాక్షన్​

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలామంది నేతలు కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ, కడియం శ్రీహరి ఎంట్రీతో కొంతమంది అసంతృప్తికి గురయ్యారు. స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సింగపురం ఇందిర లాంటి వాళ్లు కడియంను తీసుకోవద్దంటూ ఏకంగా మీటింగులు కూడా పెట్టారు. కాగా, ఇందిరతోపాటు టికెట్ ఆశించి భంగపడ్డ దొమ్మటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్ తోపాటు ఇతర అసంతృప్తులకు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ సర్ది చెప్పి, పార్టీని గెలిపించేందుకు కష్టపడాల్సిందిగా కోరారు. 

గత ఆదివారం కూడా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నేతలతో సమావేశమై పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. స్థానిక నేతల సపోర్టుతో మండలాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఈ మేరకు తండ్రీకూతుళ్లు ఇద్దరూ సోమవారం నుంచే యాక్షన్ స్టార్ట్ చేశారు. కడియం శ్రీహరి ఓ వైపు, కడియం కావ్య మరోవైపు వేర్వేరు నియోజకవర్గాలు, మండలాల నేతలతో మీటింగులు నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. 

గ్రౌండ్ వర్క్​లో బీజేపీ.. క్యాండిడేట్ వేటలోనే బీఆర్​ఎస్​

బీజేపీ అభ్యర్థిగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పోటీ చేస్తుండగా, ఇప్పటికే పార్టీ నేతలంతా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ క్యాడర్ ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవి, ఇతర నేతల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ మీటింగులు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంజూరైన నిధులు, చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. 

కాగా, టికెట్​ఆశించిన కొంతమంది బీజేపీ నేతలు ఆరూరికి సహకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు బీఆర్​ఎస్ ​వరంగల్ అభ్యర్థిని ఖరారు చేయడానికి మల్లగుళ్లాలు పడుతోంది. ఇప్పటికే ప్రకటించిన కడియం కావ్య కాంగ్రెస్​లోకి వెళ్లగా, ప్రత్యామ్నాయంగా ఎవరిని నిలబెట్టాలో తెలియక గులాబీ నేతలు గందరగోళంలో పడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ కాగా, వారి ఓట్లు రాబట్టేందుకు మహిళా ఈక్వేషన్ లో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు కొంతమంది ఉద్యమకారులు కూడా టికెట్ ఆశిస్తుండగా, అభ్యర్థిని ఫైనల్ చేయడానికి గులాబీ పార్టీ తీవ్రంగానే శ్రమిస్తోంది. 

క్యాడర్ అంతా కాంగ్రెస్ లోకి.. 

స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి బీఆర్​ఎస్​లోని తన క్యాడర్​నంతా తిరిగి కాంగ్రెస్​ వైపు మళ్లిస్తున్నారు. తన నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్య కార్యకర్తలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ లో చేర్చుతున్నారు. ముఖ్యంగా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో కడియం క్యాడర్​ ఎక్కువగా ఉండటంతో వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి మరీ చేర్పించారు. దీంతో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో బీఆర్​ఎస్ సైన్యమంతా ఖాళీ అవుతుండగా, మిగతా నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా కాంగ్రెస్​బలం మరింత పుంజుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్​ వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి