ఫేస్రికగ్నైజేషన్‌‌ యాప్‌‌కు నెట్‌‌వర్క్ కష్టాలు

ఫేస్రికగ్నైజేషన్‌‌ యాప్‌‌కు  నెట్‌‌వర్క్ కష్టాలు
  • లేట్‌‌ అవుతున్న ఫేస్‌‌ అప్‌‌డేట్‌‌
  • ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, చిన్నారులు, బాలింతలు
  • యాప్ వినియోగంపై అంగన్‌‌వాడీలకు అవగాహన లేకపోవడమూ సమస్యే
  • ఉమ్మడి జిల్లాలో 3,135 అంగన్‌‌వాడీల్లో తప్పని అవస్థలు 

పెద్దపల్లి, వెలుగు: అంగన్‌‌‌‌వాడీ సెంటర్ల ద్వారా బాలింతలు, గర్భిణులు, -ఆరేండ్లలోపున్న చిన్నారులకు అందిస్తున్న టేక్‌‌ హోం రేషన్‌‌, బాలామృతం పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌ యాప్‌‌(పోషన్​అభియాన్​ యాప్‌‌)కు నెట్‌‌వర్క్‌‌ కష్టాలు వెంటాడుతున్నాయి.  ముఖ్యంగా రూరల్‌‌ ఏరియాల్లో మొబైల్‌‌ నెట్‌‌వర్క్‌‌ సరిగా ఉండకపోవడంతో లబ్ధిదారుల ఫేస్‌‌ను క్యాప్చర్‌‌‌‌ చేయడానికి చాలా టైం పడుతోందని అంగన్‌‌వాడీలు చెబుతున్నారు. మరోవైపు అంగన్‌‌వాడీల్లో పనిచేస్తున్న కొందరికి స్మార్ట్‌‌ఫోన్ల వినియోగం లేకపోవడం, మరికొంతమందికి స్మార్ట్‌‌ఫోన్లు లేకపోవడం కూడా యాప్‌‌ నిర్వహణ కష్టమవుతోంది. 

ఉమ్మడి జిల్లాలో 3,135 అంగన్‌‌వాడీలు 

ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా 3,135 అంగన్‌‌వాడీ సెంటర్లున్నాయి. వీటి పరిధిల్లో 15, 607 మంది గర్భిణులు,  బాలింతలు 15,947 మంది, 0–6 ఏండ్ల మధ్య పిల్లలు 1, 26, 325 మంది ఉన్నారు. వీరంతా ఆయా అంగన్‌‌వాడీల ద్వారా పోషకాహారాన్ని పొందుతున్నారు. ఫేస్​రికగ్నైజేషన్​యాప్​ అమల్లోకి వచ్చాక ఆరు నెలలుగా నెట్‌‌వర్క్ సమస్యతో అంగన్‌‌వాడీ సిబ్బందితోపాటు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది అంగన్‌‌వాడీ టీచర్లకు టెక్నాలజీపై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు జరుగుతున్నాయి. 

యాప్‌‌లోనూ టెక్నికల్​ప్రాబ్లమ్స్‌‌ 

యాప్‌‌లో ఎదురువుతున్న సమస్యలను ‘ఫోన్​ ఇన్‌‌’ ద్వారా ఫిర్యాదు చేయాలని కేంద్రప్రభుత్వం చెప్పింది. ఫోన్‌‌ ఇన్‌‌లో సమస్యలను ప్రస్తావిస్తే, సరైన రెస్పాన్స్‌‌ రావడం లేదని అంగన్‌‌వాడీ టీచర్లు చెప్తున్నారు. ఫోన్​ ఇన్​ బాధ్యులు మాత్రం సమస్యలను మెయిల్​చేయాలని, లేదా స్క్రీన్​ షాట్లు తీసి పంపించమంటున్నారని అంగన్‌‌వాడీ సిబ్బంది చెబుతున్నారు. యాప్‌‌లో లబ్ధిదారుల వివరాలు ఎంటర్​చేసినప్పడు పూర్తి డేటా వస్తోందని, ఫేస్​రికగ్నైజేషన్‌‌ మాత్రం అప్డేట్‌‌ కావడానికి ఒకరోజు పడుతున్నట్లు చెప్తున్నారు. 

యాప్‌‌లో ఆధార్​ వివరాలు నమోదుచేస్తే.. ఆధార్‌‌‌‌కు అనుసంధానమైన మొబైల్‌‌ నంబర్లు పనిచేయకపోవడం వంటి వాటితో ఓటీపీ సమస్య ఏర్పడుతోంది. ఫోన్​నంబర్​ మార్చాలని ఆధార్‌‌‌‌ సెంటర్ల చుట్టూ తిరిగినా వారం పైనే పడుతోంది. ఇటీవల అధికారుల రివ్యూ మీటింగ్‌‌ల్లోనూ ఈ సమస్యలపైనే చర్చ నడుస్తోంది. యాప్​ వినియోగంపై సరైన శిక్షణ లేకుండానే అమలు చేయాలని చెబుతుండడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.