తాగి బండి నడిపితే.. జైలుకే.. డ్రంకెన్ డ్రైవ్పై వరంగల్ పోలీసుల స్పెషల్ ఫోకస్

తాగి బండి నడిపితే.. జైలుకే.. డ్రంకెన్ డ్రైవ్పై వరంగల్ పోలీసుల స్పెషల్ ఫోకస్
  • కమిషనరేట్ మెయిన్ ​రోడ్లపై రూల్స్​ బ్రేక్‍ చేసే వారిపై     కఠిన చర్యలు
  • అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ధ్వంసం
  • పెండింగ్ చలాన్లు క్లియర్​చేయకుంటే బండ్లు సీజ్‍

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ కమిషనరేట్ పోలీసులు రూల్స్​బ్రేక్‍ చేసేవారి పట్ల కఠినంగా ఉంటున్నారు. వరంగల్‍ సిటీతోపాటు కమిషనరేట్‍ పరిధిలోని మెయిన్​రోడ్లపై ఇష్టారీతిన వెళ్తే జైలుకు పంపుతున్నారు. లేదంటే  ఫైన్​వేస్తున్నారు. హెల్మెట్‍వాడకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, చెవులు పగిలే శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఉపయోగించడం, వెహికల్ నంబర్‍ ట్యాంపరింగ్‍ చేయడం, పెండింగ్ చలాన్లు కట్టకుండా తిరిగేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.  

500 మందికి పైగా జైలుకు..

పోలీసులు ఈ ఏడాది డ్రంకెన్​డ్రైవ్‍ కేసులపై ఎక్కువ దృష్టి పెట్టారు. మద్యం సేవించి వాహనంతో రోడ్డెక్కితే చాలు పట్టుకొని కేసు నమోదు చేస్తున్నారు. మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్లు తేలితే జైలుకు పంపిస్తున్నారు. 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 20,338 డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు నమోదు కాగా.. 96 మంది మాత్రమే జైలుకు వెళ్లారు. ఈ ఏడాది జూన్​వరకు19,153 డీడీ కేసులు నమోదయ్యాయి. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్డు రవాణా రూల్స్​కు విరుద్ధంగా ప్రవర్తించిన 416 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆ సంఖ్య 500 దాటినట్లు అధికారులు తెలిపారు. రూ.1.64 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. 

నంబర్‍ ప్లేట్‍ లేకుంటే బండ్లు సీజ్‍

నంబర్​ప్లేట్​లేని బైక్​లు, కార్లను పోలీసులు సీజ్‍ చేసి ఠాణాకు తరలిస్తున్నారు. దొంగల ముఠాలతో పాటు చైన్‍ స్నాచర్లు వివిధ చోట్ల వాహనాలను దొంగిలించి వాటిపైనే తిరుగుతూ మహిళల మెడలోని బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు. ఇంకొందరు ట్రాఫిక్ పోలీసులకు చిక్కొద్దని నంబర్‍ ప్లేట్ లేకుండా జర్నీ చేస్తున్నారు.

 పోలీసులు ఇప్పటికే దాదాపు 250 బైక్​లు, 16 కార్లను సీజ్‍ చేశారు. నంబర్‍ ప్లేట్‍ లేని వాటిలో 15 బండ్లను చోరీ చేసినవిగా గుర్తించారు. సమస్య తీవ్రత ఆధారంగా క్రిమినల్‍ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అధిక శబ్ధం వచ్చే సైలెనర్లు ఉన్న 580 బండ్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటివల్ల కలిగే నష్టాన్ని తెలిపేలా పలు జంక్షన్లలో కొన్నింటితో పైలాన్లు ఏర్పాటు చేశారు. మిగతా వాటిని రోడ్డు రోలర్‍ తో ధ్వంసం చేశారు. గతేడాది 1,246 సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు.  

11.27 లక్షల పెండింగ్​చలాన్లు

ఈ ఏడాది ఆగస్టు 20 నాటికి కమిషనరేట్‍లో అత్యధికంగా 1,27,194 వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేశారు. ఒక్కోదానిపై 5 నుంచి 15 చొప్పున 11,27,194 చలాన్లు పెండింగ్‍ ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం రూ.33.28 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్​లో 3 ట్రాఫిక్‍ పోలీస్‍ స్టేషన్లు ఉండగా.. వరంగల్‍ స్టేషన్‍లో 3,35,450, హనుమకొండలో 2,73,770, కాజీపేట ట్రాఫిక్‍ పీఎస్‍ పరిధిలో 3,60,423 చలాన్లు పెండింగ్​ఉన్నాయి. ఈ కేసులను క్లియర్‍ చేయడంపై సీపీ ఇటీవల స్పెషల్​మీటింగ్‍ పెట్టారు. చలాన్లు క్లియర్‍ చేయని వాహనాలు రోడ్లపై తిరిగితే ఎక్కడికక్కడ సీజ్‍ చేయనున్నట్లు తెలిపారు.

క్రిమినల్‍ కేసులు పెడ్తం

వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో సీపీ సన్‍ప్రీత్‍ సింగ్‍ ఆదేశాల మేరకు రోడ్లపై ట్రాఫిక్‍ రూల్స్​ బ్రేక్‍ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. యాక్సిడెంట్లు తగ్గించడం, ప్రయాణికుల రక్షణ మా లక్ష్యం. మద్యం సేవించి బండ్లు నడిపేవారు, నంబర్‍ ప్లేట్‍ లేకుండా తిరిగేవారి డ్రైవింగ్‍ లైసెన్స్​సస్పెండ్​చేయించడంతోపాటు క్రిమినల్​కేసులు పెడ్తం. కార్లకు బ్లాక్‍ ఫిల్మ్​వినియోగం, బైక్​లకు అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు వాడే వారిపై సీరియస్‍గా యాక్షన్​తీసుకుంటాం. - రాయల ప్రభాకర్‍రావు, అడిషనల్‍ డీసీపీ(లా అండ్‍ ఆర్టర్‍, ట్రాఫిక్‍)