
ముంబై: ముంబై మహా నగరం. దేశ ఆర్థిక రాజధాని. భారతదేశంలోని అపర కుబేరుల నిలయం. దేశవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మిస్తూ ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న అంబానీ, అదానీలు నివాసం ఉంటున్న నగరం. బాలీవుడ్ స్టా్ర్లు, టీం ఇండియా క్రికెటర్ల లగ్జరీ ఇళ్లకు కేరాఫ్ అడ్రస్. ఇలాంటి మహా నగరంలో గజం భూమి కూడా లక్షల్లో పలుకుతుంది. అందుకే.. ముంబైలో ఉద్యోగ రీత్యా ఉండే వాళ్లలో ఎక్కువ మంది అద్దె ఇళ్లలోనే జీవనం సాగిస్తుంటారు. ముంబైలో విలాసవంతమైన ఇళ్లను ఫలానా సెలబ్రెటీ కోట్లలో కొనుగోలు చేసిందని చాలా సందర్భాల్లో వార్తలు చూసే ఉంటారు. ఈ వార్త కూడా అలాంటిదే కానీ ఇక్కడ ల్యాండ్ కొన్నది సెలబ్రెటీ కాదు. అంతకు మించి.
దేశానికి పెద్దన్న బ్యాంకు అయిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ముంబై సిటీలో 4.61 ఎకరాల ల్యాండ్ను కొనేసింది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నుంచి 3 వేల 4 వందల 72 కోట్లకు ఈ ల్యాండ్ను ఆర్బీఐ కొనుగోలు చేయడం విశేషం. ఇండియాలో 2025లో ఇప్పటిదాకా జరిగిన ల్యాండ్ డీల్స్లో ఇది బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ కావడం గమనార్హం. ఆర్బీఐ కొనుగోలు చేసిన ఈ ల్యాండ్ ముంబై సిటీలో బిజినెస్ డిస్ట్రిక్ట్ అయిన నారీమన్ పాయింట్లో ఉంది. బాంబే హైకోర్టుకు, మహారాష్ట్ర సచివాలయమైన ‘మంత్రాలయ’కు, అనేక ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆర్బీఐ కొనుగోలు చేసిన ఈ ల్యాండ్ అతి దగ్గరలో ఉంది.
ముంబైలో మెట్రో ప్రాజెక్టులను డెవలప్ చేసేందుకు పూనుకున్న MMRCL, నగర మెట్రో విస్తరణకు నిధులు సమకూర్చడానికి సౌత్ ముంబై, ముంబై మిడిల్లోని భూములను వేలం వేసి అమ్మేయాలని ముంబై మెట్రో రైల్ సంస్థ డిసైడ్ అయింది. ఈ సమయంలోనే.. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని విస్తరించే ఆలోచన చేసింది. ఇలా ఆర్బీఐ, ముంబై మెట్రో రైల్ మధ్య ఈ బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ జరిగింది. ఈ ల్యాండ్ డీల్లో ఎకరం 834 కోట్లు పలకడం విశేషం. 2023లో కూడా ఇలాంటి బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ ఒకటి జరిగింది. ముంబైలోని వోర్లీ ఏరియాలో.. వాడియా గ్రూప్ 22 ఎకరాల ల్యాండ్ పార్శిల్‌ను.. జపనీస్ డెవలపర్ సుమిటోమో అనుబంధ సంస్థ అయిన GOISU రియాల్టీకి 5 వేల 200 కోట్లకు విక్రయించి ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషకులను నివ్వెరపోయేలా చేసింది.