వరద నష్టంపై తుది నివేదిక.. రోడ్లు, విద్యుత్‌ శాఖలకు రూ.205 కోట్లు నష్టం

వరద నష్టంపై తుది నివేదిక..  రోడ్లు, విద్యుత్‌ శాఖలకు రూ.205 కోట్లు నష్టం
  • రూ.12.32 కోట్లతో తాత్కాలిక పనులు పూర్తి
  • పంట నష్టం 41,098 ఎకరాలు, 300 ఎకరాల్లో ఇసుక మేటలు
  • ఉపాధి కూలీలతో తొలగింపునకు ఏర్పాట్లు 

నిజామాబాద్, వెలుగు: గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల వల్ల జరిగిన నష్టాలపై యంత్రాంగం ఫైనల్ రిపోర్టు సిద్ధం చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.161.82 కోట్ల నష్టం జరగగా, పంచాయతీరాజ్ శాఖకు రూ.26.63 కోట్ల నష్టం వాటిల్లింది. ఎన్‌పీడీసీఎల్‌కు రూ.17.33 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 

41,098 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి పంట ఎక్కువగా దెబ్బతినడంతో సుమారు 17 వేల మంది రైతులు నష్టపోయారు. 300 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. వీటిని ఉపాధి కూలీలతో తొలగించాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

దెబ్బతిన్న వరి, సోయాబీన్.. 

జిల్లాలో ఈ వానాకాలం 4.32 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 28,131 ఎకరాల వరి పంట దెబ్బతిన్నది. ఆగస్టు 17 నుంచి19, 27 నుంచి 30 తేదీల్లో కురిసిన వర్షాల వల్ల 33 శాతం కంటే అధికంగా వరి పంట నష్టపోయినట్లు అగ్రికల్చర్ అధికారులు పేర్కొన్నారు. వరి తర్వాత 12,054 ఎకరాల సోయాబీన్ పంట ధ్వంసమైంది. 565 ఎకరాల జొన్న పంట, 348 ఎకరాలు ఇతర పంటలు నష్టపోయాయి. 300 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు గుర్తించారు. వ్యవసాయ శాఖ ఏఈవోలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఉపాధి కూలీలతో ఇసుక మేటలు తొలగించాలని డీఆర్డీవో నిర్ణయించింది.

విద్యుత్ శాఖకు రూ.17.33 కోట్లు నష్టం..

వరదల వల్ల 1,794 విద్యుత్ పోల్స్, 1,587 ట్రాన్స్​ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఇండ్లకు సంబంధించిన 85 పోల్స్, 42 ట్రాన్స్​ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వ్యవసాయ రంగంలో 1,709 పోల్స్, 1,545 ట్రాన్స్​ఫార్మర్లు పని చేయడం లేదు. ఇండ్లకు, వ్యవసాయానికి సంబంధించి కరెంట్ సరఫరా పునరుద్ధరించేందుకు కొత్త పోల్స్, ట్రాన్స్​ఫార్మర్లు అమర్చారు.

ముత్యాల చెరువు వివాదం..

ధర్పల్లి మండలం హోన్నాజీపేటలో ముత్యాల చెరువు కట్ట తెగింది. దీంతో ధర్పల్లి, సిరికొండ, భీంగల్ మండలాల్లో భారీ పంట నష్టం వాటిల్లింది.  ఐదున్నర అడుగుల ఎత్తులో వరద నీరు పొలాల్లోకి చేరి ఇసుక మేటలు వేశాయి. చెరువులో నీరు ఆగిపోవడంతో పొలాలు ఇసుక ఏడారిలా కనిపిస్తున్నాయి. 1994లో నిర్మించిన ఈ చెరువు వల్ల ప్రతీ సంవత్సరం సమస్య ఉత్పన్నమవుతోందని స్థానిక రైతులు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి విన్నవించారు. చెరువు పునరుద్ధరణ వద్దని వేడుకున్నారు. 

పెద్ద ఎత్తున రోడ్లు ధ్వంసం..

వర్షాల వల్ల 175 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసమయ్యాయి. రూ.8.98 కోట్లతో ఇంజినీర్లు తాత్కాలిక రిపేర్లు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించారు. పూర్తిస్థాయి పునర్నిర్మాణానికి రూ.161.82 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. పంచాయతీరాజ్ పరిధిలో 73.54 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రూ.3.34 కోట్లతో తాత్కాలిక పనులు పూర్తి చేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.26.63 కోట్లు కావాలని ప్రభుత్వానికి రిపోర్టు చేశారు.