ఏం వానరా నాయనా.. మెదక్ టౌన్లో దంచికొట్టిన వర్షం.. ఎటు చూసినా వరద నీళ్లే !

ఏం వానరా నాయనా.. మెదక్ టౌన్లో దంచికొట్టిన వర్షం.. ఎటు చూసినా వరద నీళ్లే !

మెదక్: మెదక్ పట్టణంలో గురువారం ఉదయం వర్షం దంచికొట్టింది. టౌన్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగస్ట్ 27 నుంచి 29 దాకా కురిసిన భారీ వర్షాలు మెదక్ జిల్లాకు అపార నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. వాన దంచి కొట్టడంతో నదీ, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులకు గండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ఉధృతికి  ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు  దెబ్బతిన్నాయి. అనేక రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి.

విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమయింది. వందలాది విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, ట్రాన్స్​ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సబ్ స్టేషన్లు డ్యామేజీ అయ్యాయి. మైనర్​ ఇరిగేషన్​ చెరువుల కట్టలకు, కాల్వలకు గండ్లు పడ్డాయి. వందల సంఖ్యలో ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. 

ఆగస్ట్ 27 నుంచి 29 దాకా కురిసిన వర్షాలకు మంజీరా నది, హల్దీ, పుష్పాల, పసుపులేరు, గుండు, నక్క వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వరద ప్రభావంతో ఆయా మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. మెదక్, సిద్దిపేట, రామాయంపేట, తూప్రాన్ పట్టణాల్లో అనేక కాలనీలు, సంగారెడ్డి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సిద్దిపేట జిల్లాలో 99.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొమురవెల్లి మండలంలో అత్యధికంగా 206.7  మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పట్టణంలోని కోమటిచెరువు మత్తడి దూకింది. శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస నగర్, హైదరాబాద్ రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్సాన్ పల్లి రోడ్డు ప్రాంతాల్లో మత్తడి కాలువ పొంగిపొర్లడంతో వరద ఇండ్లలోకి చేరింది.