కరీంనగర్ జిల్లాలో పిచ్చి కుక్క దాడి..ఎనిమిది మందికి గాయాలు

కరీంనగర్ జిల్లాలో పిచ్చి కుక్క దాడి..ఎనిమిది మందికి గాయాలు

రామడుగు, వెలుగు : కరీంనగర్‌‌ జిల్లాలో  పిచ్చికుక్క దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. రామడుగు మండలం లక్ష్మీపూర్​లో గురువారం పిచ్చికుక్క వరుసగా దాడి చేయగా దూట శ్రీధర్, దుర్గం పవన్, బండారి రవి, బండారి రాజమ్మ, జాడి రమేశ్, జాడి శంకరమ్మ, లక్ష్మి, గాదం అంజలి కాళ్లు చేతులపై గాట్లు పడ్డాయి. మరో ఎనిమిది పశువులను కరవగా అందులో రెండు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గాయపడిన బాధితులు రామడుగు, గుండి పీహెచ్​సీల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.  ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.