ఒకవైపు అప్లికేషన్లు.. ఇంకోవైపు అభ్యర్థుల ప్రకటనలు

ఒకవైపు అప్లికేషన్లు..  ఇంకోవైపు అభ్యర్థుల ప్రకటనలు
  • వికారాబాద్ క్యాండిడేట్​గా ప్రసాద్​ను గెలిపించాలన్న రేవంత్​
  • కోదాడ నుంచి భార్య.. హుజూర్​నగర్ నుంచి తాను పోటీ చేస్తానన్న ఉత్తమ్​

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఓ వైపు అప్లికేషన్లు తీసుకుంటుంటే.. మరోవైపు ఆ పార్టీ లీడర్లే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఊ హించిన దాని కంటే ఎక్కువే దరఖాస్తులు వస్తున్నాయి. సామాన్య కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం అప్లై చేసుకుంటున్నారు. పార్టీలోని పెద్ద లీడర్లు మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల రేసులో ఎవరు ఉంటున్నారో ముందే అనౌన్స్ చేసేస్తున్నారు. తాజాగా చేవెళ్ల, పరిగి, వికా రాబాద్, తాండూరుల్లో సుడిగాలి పర్యటన చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వికారాబాద్ అభ్యర్థి పేరును ప్రకటించేశారు. 

ప్రసాద్​ను గెలిపించాలంటూ అక్కడికి వచ్చిన వారిని కోరారు. కొద్ది రోజుల కింద ఎంపీ ఉత్తమ్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. హుజూర్​నగర్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి బరిలో ఉంటున్నామని స్పష్టం చేశారు. మరికొందరు నేతలు ఇదే మాదిరిగా ఇన్ ​డైరెక్ట్​గా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులను ముందే డిసైడ్​ చేస్తే.. అప్లికేషన్లు ఎందుకన్నా గుసగుసలు గాంధీభవన్​లో విని పిస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించేస్తే ఈ ఎన్నికల కమిటీలు, ఈ స్క్రీనింగ్​ కమిటీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది సామాన్యులు రూ.50 వేల దాకా ఫీజు కట్టి పార్టీ అభ్యర్థిత్వం కోసం అప్లై చేసుకుంటున్న క్రమంలో.. ఇలాంటి ప్రకటనలేంటని అంటున్నారు.