దుబ్బాక 12వ రౌండులో ఆధిక్యంలోకి కాంగ్రెస్

దుబ్బాక 12వ రౌండులో ఆధిక్యంలోకి కాంగ్రెస్

దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగులో బీజేపీ, టీఆర్ఎస్ నువ్వా.. నేనా.. అన్నట్లు విజయం కోసం పోటీపడుతున్నాయి. కాగా.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పన్నెండో రౌండ్లో ఆధిక్యాన్ని సాధించింది. ఈ రౌండులో కాంగ్రెస్ 2080 ఓట్లను సాధించింది. కాగా.. బీజేపీ 1997, టీఆర్ఎస్ 1900 ఓట్లు సాధించాయి. మొదటి నుంచి వెనుకంజలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా 12 వ రౌండులో ఆధిక్యాన్ని సాధించడంతో.. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు 10662 ఓట్లు నమోదయ్యాయి.

దుబ్బాక ఉపఎన్నికలకు సంబంధించి మొదటి పది రౌండ్లలో బీజేపీ ఏడు రౌండ్లలో ఆధిక్యంతో హవా కొనసాగించగా.. టీఆర్ఎస్ రెండు రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించింది. కాగా.. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్‌కు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం 1504 ఓట్లలో టీఆర్ఎస్‌కు 1008, బీజేపీకి 492 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండు నుంచి అయిదు రౌండ్ వరకూ బీజేపీ ఆధిక్యంలోనే దూసుకెళ్లింది. మొదటి రౌండులో బీజేపీ 620 ఓట్లు, రెండో రౌండులో 279 ఓట్లు, మూడో రౌండులో 1259 ఓట్ల మెజారిటీని సాధించింది. నాలుగో రౌండులో 1425 ఓట్ల మెజారిటీని, అయిదోరౌండులో 336 ఓట్ల మెజారిటీని సాధించింది. మొత్తంగా దుబ్బాక మండలంలో అయిదు రౌండ్లలో కలిపి బీజేపీ 3020 ఓట్ల మెజారీటీ సొంతం చేసుకుంది.

మొదటి రౌండులో ఫలితాలలో కాంగ్రెస్ 648, బీజేపీ 3208, టీఆర్ఎస్ 2,867 ఓట్లు సాధించాయి.

రెండో రౌండులో ఫలితాలలో బీజేపీ 1561, టీఆర్ఎస్ 1282 ఓట్లు సాధించాయి. ఈ రౌండులో బీజేపీకి 279 ఓట్ల ఆధిక్యం లభించింది.

మూడో రౌండులో ఫలితాలలో బీజేపీ 6492, టీఆర్ఎస్ 5357, కాంగ్రెస్ 1315 ఓట్లు సాధించాయి. ఈ రౌండులో బీజేపీకి 1,259 ఓట్ల ఆధిక్యం లభించింది.

నాలుగో రౌండులో బీజేపీకి 1,425 ఓట్ల ఆదిక్యం లభించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. సొంతూరు బొప్పాపూర్‌లో 277 ఓట్ల ఆధిక్యం సాధించారు. అక్కడ బీజేపీకి 424, టీఆర్ఎస్‌కు 147 ఓట్లు లభించాయి. మొత్తంగా నాలుగు రౌండ్లలో కలిపి బీజేపీ 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

అయిదోరౌండులోనూ బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. అయిదోరౌండు కౌంటింగ్‌లో 336 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా అయిదురౌండ్లలో కలిపి బీజేపీ 3020 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.

అయిదు రౌండ్ల తర్వాత ఆధిక్యంలోకి టీఆర్ఎస్
అయిదు రౌండ్ల తర్వాత మొదటిసారి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. మొదటి అయిదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించగా.. ఆరో రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఈ రౌండులో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యంలో ఉంది. దాంతో బీజేపీ 2667 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆరో రౌండులో బీజేపీ 3709 ఓట్లు, టీఆర్ఎస్ 4062 ఓట్లు, కాంగ్రెస్ 530 ఓట్లు దక్కించుకున్నాయి. ఈ రౌండులో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తన సొంతూరైన చిట్టాపూర్‌లో 846 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 406 ఓట్లు దక్కించుకున్నారు.

ఏడో రౌండులో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ 182 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఈ రౌండులో టీఆర్ఎస్‌కు 2718, బీజేపీకి 2536, కాంగ్రెస్ 749 ఓట్లు వచ్చాయి. ఏడు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 22,762 ఓట్లు, టీఆర్ఎస్‌కు 20,277 ఓట్లు, కాంగ్రెస్‌కు 4,003 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 2,485 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్ వరకు 52,055 ఓట్లు లెక్కించారు.

ఎనిమిదో రౌండులో మళ్లీ బీజేపీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఈ రౌండులో బీజేపీ 621 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 3106 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ 2495, బీజేపీ 3116, కాంగ్రెస్ 1122 ఓట్లు సాధించాయి.

తొమ్మిదో రౌండ్‌లో బీజేపీ 3413 ఓట్లు సాధించింది. టీఆర్ఎస్‌కు ఈ రౌండులో 2329 ఓట్లు, కాంగ్రెస్‌కు 675 ఓట్లు నమోదయ్యాయి. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 4190 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండులో బీజేపీ 1084 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 29,291 ఓట్లు, టీఆర్ఎస్‌కు 25,101ఓట్లు, కాంగ్రెస్‌కు 5,800 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు నియోజకవర్గంలో 66,807 ఓట్లు లెక్కించారు.

పదో రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఈ రౌండులో టీఆర్ఎస్‌కు 2948, బీజేపీ 2492, కాంగ్రెస్ 899 ఓట్లు సాధించాయి. ఈ రౌండులో టీఆర్ఎస్‌కు 456 ఓట్ల ఆధిక్యం లభించింది.

పదకొండో రౌండ్లో బీజేపీకి 199 ఓట్ల ఆధిక్యం లభించింది. దాంతో పదకొండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 3933 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో బీజేపీకి 2965, టీఆర్ఎస్‌కు 2766, కాంగ్రెస్‌కు 1883 ఓట్లు నమోదయ్యాయి. పదకొండో రౌండ్ ముగిసేసరికి మొత్తంగా 82,503 ఓట్లు లెక్కించారు.