బీఆర్ఎస్​ కంచుకోటపై..కాంగ్రెస్​ కన్ను

బీఆర్ఎస్​ కంచుకోటపై..కాంగ్రెస్​ కన్ను
  • జిల్లాలోని 3 సెగ్మెంట్లపై స్పెషల్ ​ఫోకస్
  • పట్టు సాధించడానికి బీజేపీ ప్రయత్నం
  • వ్యూహాలకు పదును పెడుతున్న మూడు పార్టీల నేతలు

సిద్దిపేట, వెలుగు : బీఆర్ఎస్​ కంచుకోటగా ఉన్న సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మూడు సెగ్మెంట్లలో అధికంగా ఓట్లను పొందిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అదే సీన్ రిపీట్ చేసి విజయానికి బాటలు వేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు సాధించడానికి పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో  మూడు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ 3,14,755,  కాంగ్రెస్ 80,905, బీజేపీ1,34,920 ఓట్లు సాధించాయి.  

వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు

సిద్దిపేట జిల్లా నుంచే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో  పోలింగ్ రోజు తమ అభ్యర్థికే ఓట్లు పడే విధంగా ప్లాన్​ చేస్తున్నారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్ చార్జిలను నియమించడమే కాకుండా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. యూత్, స్టూడెంట్, సోషల్ మీడియా విభాగాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్​ నుంచి ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ తో పాటు ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సిద్దిపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే, మైనంపల్లి హన్మంతరావుకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీ సాధిస్తే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం దక్కుతుందని హామీ ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నీ తానై ప్రచార వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలను కలుపుకుని రోడ్డు షోలు, మార్నింగ్ వాక్ లు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలతో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 

సామాజిక వర్గాలపై నజర్

మెదక్ పార్లమెంట్ పరిధిలో 18.12 లక్షల ఓటర్లుండగా వీరిలో అత్యధికంగా బీసీ వర్గాలే ఉన్నాయి. నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో బీసీ వర్గాలకు చెందిన ఓటర్లు దాదాపు ఆరు లక్షల పై చిలుకు ఉండడంతో అభ్యర్థులందరూ వారిపై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో ముదిరాజ్ వర్గానికి అత్యధిక ఓట్లుండడంతో వారి మద్దతు పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.  కాంగ్రెస్ అభ్యర్థిగా ముదిరాజ్ వర్గానికి చెందిన నీలం మధు బరిలో నిలవడంతో ఆ పార్టీ నేతలు దీన్నే ప్రచార అస్ర్తంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.

బీజేపీ, బీఆర్​ఎస్​ఓసీ అభ్యర్థులను బరిలో దించితే తాము బీసీ అభ్యర్థికి అవకాశమిచ్చామని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రచారాల్లో ప్రస్తావిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓబీసీ బిడ్డను మూడోసారి దేశానికి ప్రధాని చేయాలని బీజేపీ అభ్యర్థిస్తోంది.