నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

వెలుగు నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ను నిరసిస్తూ బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ లీడర్లు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేసీఆర్‌‌‌‌ సర్కార్‌‌‌‌కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. లిక్కర్‌‌‌‌ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే సంజయ్‌‌‌‌ని అరెస్ట్‌‌‌‌ చేయించారని ఆరోపించారు. అధికార పార్టీ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నా నిరసన తెలిపే హక్కులేదా అని ప్రశ్నించారు. అన్ని అనుమతులు తీసుకొని మొదలుపెట్టిన యాత్రను మధ్యలోనే అడ్డుకోవడం సీఎం కేసీఆర్‌‌‌‌ పిరికితనానికి నిదర్శనం అన్నారు. యాత్రకు వస్తున్న ఆదరణను ఓర్వలేకే లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ పేరుతో అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంగ్రామ యాత్రను ఆపేది లేదని స్పష్టం చేశారు. భువనగిరిలో జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌రావు, లీడర్లు పాదరాజు ఉమాశంకర్​రావు, మాయా దశరథ, చౌటుప్పల్‌‌‌‌లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్‌‌‌‌, మండల అధ్యక్షుడు రిక్కల సుధాకర్‌‌‌‌రెడ్డి, సూర్యాపేటలో జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, పట్టణ అధ్యక్షుడు అబీబ్, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో వేముల శేఖర్ రెడ్డి, రామరాజు, కోదాడలో జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్‌‌‌‌, రాష్ట్ర నాయకులు కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన పాల్గొన్నారు.


రాష్ట్రంలో అలజడికి బీజేపీ కుట్ర
సూర్యాపేట/తుంగతుర్తి, వెలుగు : తెలంగాణలో అలజడి సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విద్యుత్‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌‌‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ లీడర్లు కావాలనే దాడి చేశారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే వారి ఎజెండా అని విమర్శించారు. రాజాసింగ్‌‌‌‌తో ప్రకటన చేయించింది బీజేపీయేనని, దానిని కప్పి పుచ్చుకునేందుకే సస్పెన్షన్‌‌‌‌ డ్రామా ఆడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌కుమర్‌‌‌‌తో కలిసి జాజిరెడ్డిగూడెం మండలం కోడూరులో శంభు లింగేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనకల్‌‌‌‌లో పెట్రోల్‌‌‌‌బంక్‌‌‌‌ను ప్రారంభించారు. 

భూములు ఆక్రమించి మాపైనే కేసు పెడ్తున్నరు

సూర్యాపేట,  వెలుగు: అధికార పార్టీకి చెందిన లీడర్​భూములు ఆక్రమించుకొని తిరిగి తమపైనే కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దళితులు జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ముకుందాపురం రెవెన్యూ శివారులోని 247 సర్వే నంబర్ లో సాయిరెడ్డి గోపయ్యకు 10 ఎకరాల భూమి ఉండగా  22 ఏండ్లుగా మీసాల వెంకన్న, పాపయ్య కలిసి సాగు చేసుకుంటున్నారన్నారు. 2020లో గోపయ్య నుంచి వీరిద్దరు 6 ఎకరాల  భూమి కొన్నారు. భూమి కోర్టు వివాదంలో ఉండడంతో పట్టాలు రాలేదన్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మద్దిరాల గ్రామ సర్పంచ్​భర్త అయిన  షేక్ అబ్దుల్ రజాక్ కోర్టులో కాంప్రమైజ్ అయితే  వెంటనే మీ పేరుపై పట్టా పుస్తకాలు ఇప్పిస్తానని చెప్పాడన్నారు. ఆయన మాటలు నమ్మి 8 నెలల క్రితం కేసును విత్ డ్రా చేసుకున్నామని చెప్పారు. వెంటనే  రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై  రజాక్, మైనం చంద్రశేఖర్  పేరు మీద ఆరు నెలల క్రితం ఆ భూమిని పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. 22 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న   దళితుల భూమిలోకి అక్రమంగా చొరబడ్డారని, ప్రశ్నించిన రైతులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనైనా అధికారులు వాస్తవాలు గ్రహించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో శ్రీదేవికి  వినతిపత్రం అందించారు. విచారణ చేస్తామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. 

‘మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వస్తరు’
చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి వస్తారని కాంగ్రెస్‌‌‌‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌‌‌‌ చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌లో బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల విస్తృతస్థాయి మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు. బీజేపీ లీడర్లు మతవిధ్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పెన్షన్‌‌‌‌ ఇచ్చే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కుంటున్న టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్న కైలాశ్‌‌‌‌నేత, సుర్వి నర్సింహ పాల్గొన్నారు.


మిర్యాలగూడ జిల్లా విషయాన్ని సీఎంకు వివరించా..
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు విషయాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌‌‌రావు చెప్పారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, నాగార్జునసాగర్‌‌‌‌ ఎమ్మెల్యేలు కలిసి వస్తే జిల్లా ఏర్పాటు తేలిక అవుతుందన్నారు. జిల్లా ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కోరినట్లు తెలిపారు. అవసరమైతే జిల్లా సాధన సమితి సభ్యులను సీఎం వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కన్వీనర్‌‌‌‌ మాలోతు దశరథనాయక్‌‌‌‌, రాజు, తాళ్లపల్లి రవి, బంటు వెంకటేశ్వర్లు, చేగొండి మురళీయాదవ్‌‌‌‌, జయరాజు, జ్వాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

మునుగోడులో పోటీ చేస్తం
చండూరు, వెలుగు : మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున క్యాండిడేట్‌‌‌‌ను నిలబెడుతామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ చెప్పారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్‌‌‌‌లో బుధవారం రోడ్‌‌‌‌షో నిర్వహించి మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి అధ్వానంగా మారిందని, మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేదన్నారు. హాస్పిటల్‌‌‌‌ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్‌‌‌‌ను గెలిపిస్తే రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రజలకు వైద్య సదుపాయాలు మెరుగయ్యేలా చూస్తామన్నారు.