సునీల్ కనుగోలు వ్యూహాలపై హస్తం నేతల మల్లగుల్లాలు

సునీల్ కనుగోలు వ్యూహాలపై హస్తం నేతల మల్లగుల్లాలు

కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు వ్యూహాలు హస్తం పార్టీ లీడర్లకు షాక్ కొడుతున్నాయట. అంతా సీక్రెట్ గా వ్యవహారిస్తున్నారట. ఏదైనా కార్యక్రమం ఉంటే టైమ్ కు చెప్తున్నారట. అప్పటికప్పుడు ప్రీపేర్ కావడానికి ఇబ్బంది పడుతున్నారట కాంగ్రెస్ లీడర్లు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా లీడర్లకు టైమ్ పడుతోందట. 

కర్ణాటక, తెలంగాణలో పార్టీ స్ట్రాటజిస్ట్ గా సునీల్ కనుగోలుని రెండేళ్ల క్రితం ఏఐసీసీ నియమించింది. కర్ణాటకలో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేశారో.. తెలంగాణలోనూ వాటినే ఇంప్లీమెంట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట. ఎప్పుడు ఏ కార్యక్రమం చేయ్యాలో డిసైడ్ చేసేది సునీల్ కనుగోలే. దీంతో ఆయన ఎప్పుడు ఏం చేప్తారోనని లీడర్లు అటెన్షన్ గా ఉంటున్నారట. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో పరేషాన్ అవుతున్నారట పార్టీ లీడర్లు.

రీసెంట్ గా బోయిన్ పల్లి గాంధీ ఐడియాలోజి సెంటర్ లో ప్రజాకోర్టు పెట్టింది పీసీసీ. ప్రొఫెసర్ కంచ అయిలయ్య జడ్జిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీ నేతలు అభియోగాలు మోపారు. అంతా బాగానే ఉన్నా..ఈ కార్యక్రమం ఇలా ఉంటుందని ఎవ్వరికీ తెలీదట. పార్టీ రెగ్యూలర్ స్టైల్లో ఉంటుందని అనుకున్నారట. తీరా చూస్తే సినిమాటిక్ స్టైల్లో సెట్టింగ్ వేసి కార్యక్రమం చేస్తారని తెల్వదట. ఒక్క లీడర్ కూడా ముందస్తుగా ప్రీపేర్ కాలేదట. అప్పటికప్పుడు చేతిలో పేపర్లు పెట్టి..సర్కార్ పై అభియోగాలు చదివించారట. ముందే చెప్తే కొంత ప్రిపేర్ అయ్యేవాళ్లమని ముచ్చట పెట్టుకున్నారట. ఇలాంటి ప్రోగామ్ సిటీలో పెడ్తే బాగుండునని, సీటీ బయట పెట్టడంతో జనాల్లోకీ అంతగా రీచ్ కాలేదని మాట్లాడుకుంటున్నారట. 

ఖమ్మం జన గర్జన సభలో కూడా ఇలాగే జరిగిందట. చేయూత స్కీం కింద 4 వేల పింఛన్ ప్రకటన కూడా ఎవ్వరికి తెలీదట. ఖమ్మం సభలో రాహుల్ చెప్పేవరకు సొంత పార్టీ లీడర్లకు లీక్ కాలేదట. అంతా సీక్రెట్ గా ఉంచారట. రాహుల్ స్పీచ్ అనువాదం చేసిన ఉత్తమ్ కూడా మరోసారి అడిగి చెప్పాల్సి వచ్చిందట. ప్రతిసారి చివరి నిమిషంలో చెప్పడమో.. సభలో సడెన్ గా ప్రకటన చేయడమో జరుగుతోందట. పీసీసీ రిలీజ్ చేస్తున్న డిక్లరేషన్లు సైతం సీక్రెట్ గానే ప్రిపేర్ చేసి నేరుగా సభలోనే ప్రకటన చేస్తున్నారట.

సీక్రెట్ గా ఉంచడం వ్యూహమైతే.. కనీసం పార్టీలోని పెద్ద లీడర్లకు కూడా చెప్పరా అనే టాక్ నడుస్తోందట. సడెన్ గా నిర్ణయాలు తీసుకుంటే. ఇబ్బంది పడుతున్నామని ఒకరికొకరు చెప్పుకొని ఫీలవుతున్నారట హస్తం లీడర్లు.