- రంగంలోకి ప్రధాన నేతలు
- రసవత్తరంగా మున్సిపల్రాజకీయం
ఆసిఫాబాద్, వెలుగు: మున్సిపల్ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పారిశ్రామిక ప్రాంతం అయిన కాగజ్ నగర్ లో కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల నేతలు ప్రజల్లోకి వెళ్లి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అయితే ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే కాగజ్‌నగర్ పట్టణ వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు చెందినవారు ఇక్కడ ఏండ్లుగా నివాసం ఉంటున్నారు. ఏ గల్లీ చూసినా భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది.
20 వేల మంది కార్మిక ఓటర్లు
నిజాం కాలం నుంచి కాగజ్ నగర్ పట్టణం పారిశ్రామిక ప్రాంతంగా విరాజిల్లుతోంది. పట్టణంలో సుమారు 80 వేల మంది జనాభా ఉంటే వారిలో 51,205 మంది ఓటర్లు ఉన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఇక్కడ ఏర్పాటైన సర్ సిల్క్ కంపెనీ వల్ల పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు కూడా పట్టణంలోనే ఉండడంతో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాదాపు 20 వేలకు పైగానే కార్మికుల ఓట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో వారి ఓట్లు సాధిస్తే విజయం మనదేనని అభ్యర్థులు భావిస్తున్నారు. కార్మికుల ఓట్లే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నారు.
మూడు పార్టీలకు అవకాశం
కాగజ్ నగర్ మున్సిపాలిటీ 1958లో ఏర్పాటైంది. ఇప్పటివరకు 9 మంది మున్సిపల్ చైర్ పర్సన్లుగా పనిచేశారు.1967లో తొలిసారి ఎన్నికలు జరగ్గా స్వతంత్ర అభ్యర్థి మోతిచంద్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఐదేండ్ల పదవీకాలం ముగిసినా.. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించపోవడంతో ఏకంగా తొమ్మిదేండ్లపాటు ప్రత్యేక అధికారుల పాలన సాగింది.
1981లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నర్సయ్య చైర్‌పర్సన్‌గా పనిచేయగా..1987లో టీడీపీ అభ్యర్థి బుచ్చి లింగం బాధ్యతలు నిర్వహించారు.1995 నుంచి ఐదేండ్లపాటు మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన సాగింది.2000లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కావేటి సాయిలీల చైర్‌పర్సన్‌గా పనిచేశారు.2005లో సులేమాన్ బీన్ సాహిద్ కాంగ్రెస్ తరపున చైర్‌పర్సన్‌గా పనిచేయగా.. 2009 నుంచి 2014 వరకు ప్రత్యేక అధికారుల పాలన సాగింది.
2014 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఆ పార్టీ తరపున సీపీ విద్యావతి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు పనిచేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ ఎస్ నుంచి గెలిచిన సద్దాం హుస్సేన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో షాహిన్ సుల్తానా ఏడాది పాటు చైర్ పర్సన్ గా పనిచేశారు.
పోటాపోటీ ప్రచారం
కాగజ్ నగర్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ దండే విఠల్ బాధ్యత తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. పార్టీ అధికారంలో ఉండడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం.
ఇక బీఆర్ఎస్ మరోసారి చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభ్యర్థుల గెలుపు బాధ్యత తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన వర్గీయులు ఆరుగురిని బరిలో నిలిపి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే హరీశ్ బాబు బీజేపీ అభ్యర్థులను మెజార్టీ సీట్లలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా తీసుకొచ్చి పట్టభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో సొంత సర్వేలు చేపట్టి అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరికి వారే అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతున్నారు.
