
- సోషల్ జస్టిస్ ప్రకారమే పోస్టులు: వివేక్ వెంకటస్వామి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపు
- కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ.. పరిశీలించిన ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశీలకులు
కోల్బెల్ట్/చెన్నూరు, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, వాళ్లకే పదవులు వస్తాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, మందమర్రిలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పట్టణ, మండల అధ్యక్ష పదవుల ఎంపిక కోసం పీసీసీ అబ్జర్వర్లు జంగా రాఘవరెడ్డి, రాంభూపాల్ చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గత బీఆర్ఎస్ పాలన అహంకారపూరితంగా సాగిందని, ఆ టైమ్‌లో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారన్నారు. తమ కష్టాలు కాంగ్రెస్‌తోనే తీరుతాయని భావించిన ప్రజలు తమను గెలిపించారన్నారు. 18 నెలల్లోనే వందల కోట్ల ఫండ్స్ తెచ్చి చెన్నూరు నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించినట్టు చెప్పారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం బతుకమ్మ వాగు నుంచి వాటర్ సప్లై జరుగుతున్నదని, భవిష్యత్‌లో ఇవి సరిపోవని, 15 ఏండ్ల వరకు నీటి కొరత లేకుండా మరో స్కీం మంజూరుకు కృషి చేస్తున్నానని చెప్పారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తాను కలిసి అమృత్ 2.0 కింద వాటర్ సప్లై కోసం రూ.100 కోట్లతో స్కీమ్ మంజూరు చేయించినట్టు వెల్లడించారు. చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రిల్లో అమృత్ స్కీమ్ పనులు సాగుతున్నాయన్నారు. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై కేసులు పెట్టాలని పీసీసీ ప్రెసిడెంట్ ఆదేశించారని గుర్తుచేశారు.
కోదండరామాలయంలో పూజలు..
మందమర్రి మండలం ఊరు మందమర్రిలో కొత్తగా నిర్మించిన కోదండ రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన పలువురిని సన్మానించారు. సోమవారం రాత్రి మందమర్రిలోని బీ1 క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి అభివృద్ధి పనులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మందమర్రిలోని 10 వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఖలీల్ సోదరుడి వివాహానికి వెళ్లి అతన్ని ఆశీర్వాదించారు.
దందాలకు చెక్ పెట్టా..
బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో భూ దందా, ఇసుక దందా, బియ్యం దందా యథేచ్ఛగా సాగిందని, తాను ఎమ్మెల్యే కాగానే వీటికి చెక్ పెట్టించానని వివేక్ తెలిపారు. భూ సమస్యలుంటే రెవెన్యూ ఆఫీసర్లు చట్టం ప్రకారం పరిష్కరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో సోషల్ జస్టిస్ పాటించాలన్న రాహుల్ గాంధీ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ ఆధ్వర్యంలో కమిటీలను ఎంపిక చేస్తారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, లీడర్లకు అధిష్టానం అండగా ఉంటుందని, వారికే సంస్థాగత పదవుల్లో ప్రయారిటీ ఇస్తుందని పీసీసీ అబ్జర్వర్లు జంగా రాఘవరెడ్డి, రాంభూపాల్ పేర్కొన్నారు.
కాకా కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తుందని చెప్పారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యీ పురాణం సతీశ్ కుమార్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కేవీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.