అక్టోబర్ 18న ములుగు జిల్లాకు రాహుల్, ప్రియాంక.. రామప్ప నుంచి కాంగ్రెస్ ప్రచారం

అక్టోబర్ 18న ములుగు జిల్లాకు రాహుల్, ప్రియాంక.. రామప్ప నుంచి కాంగ్రెస్ ప్రచారం
  • తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్
  • మహిళా డిక్లరేషన్‌‌ను ప్రకటించనున్న ప్రియాంక
  • రామంజపూర్​లో మహిళలతో సభ
  • 19న భూపాలపల్లిలో నిరుద్యోగులతో కలిసి రాహుల్ బైక్ ర్యాలీ
  • 20న నిజామాబాద్ జిల్లాలో పర్యటన

జయశంకర్ భూపాలపల్లి, వెంకటాపూర్​(రామప్ప), వెలుగు: ప్రముఖ చారిత్రక, పర్యాటక కేంద్రం రామప్ప వేదికగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. ఇందుకోసం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బుధవారం ములుగు జిల్లాలోని రామప్పకు రానున్నారు. తొలుత రామప్ప ఆలయంలో పూజల తర్వాత తొలి విడత బస్సు యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. తర్వాత -రామంజపూర్‌‌లో 10 వేల మంది మహిళలతో ఏర్పాటు చేయనున్న సభలో మహిళా డిక్లరేషన్‌ను ప్రియాంక ప్రకటించనున్నారు.

19న భూపాలపల్లిలో నిరుద్యోగ యువత నిర్వహించే బైక్ ర్యాలీలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ మేరకు రాహుల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ పూర్తి చేసింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ సభ్యులు గండ్ర సత్యనారాయణరావు తదితరులు మంగళవారం సభా స్థలిని పరిశీలించారు.

రామప్ప టెంపుల్ దగ్గర ప్రచారానికి నో పర్మిషన్

బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌‌లో రామప్ప చేరుకోనున్న రాహుల్, ప్రియాంక.. శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజ లు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సు ద్వారా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాపురం మండలం రామాంజపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో మహిళా డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ వెల్లడించనున్నారు. సభ తర్వాత జెన్ కో గెస్ట్ హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. గురువారం ఉదయం 7:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5 ఇంక్లైన్ కమాన్ నుంచి బాంబుల గడ్డ వరకు నిరుద్యోగ యువత నిర్వహించే భారీ బైక్ ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు.

మరోవైపు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ పరిసరాల్లో ఎన్నికల ప్రచారానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. మంగళవారం ములుగు జిల్లా ఎస్పీ గాష్ ఆలం.. రామప్ప దగ్గర హెలిప్యాడ్ పరిశీలించారు. తర్వాత ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘రామప్ప టెంపుల్‌లోకి పార్టీ కండువాలు వేసుకొని వెళ్లడానికి అనుమతి లేదు. పార్టీ జెండాలు కూడా కట్టకూడదు. టెంపుల్ పరిసరాల్లో ఎన్నికల ప్రచారం నిషేధం. అతిథులకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం వంటి కార్యక్రమాలు ఉండవు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. టెంపుల్​లో పూజలు చేసుకుని వెళ్లడానికి అనుమతిచ్చాం” అని పోలీసులు వివరించారు.

పెద్దపల్లి, ఆర్మూర్‌‌లోనూ సభలు

రాహుల్ గాంధీ19న ఉదయం భూపాలపల్లి జిల్లా పర్యటన ముగించుకుని.. రామగుండం చేరుకుంటారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సింగరేణి, ఎన్‌టీపీసీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, ఆర్ఎఫ్‌సీఎల్ ఎంప్లాయిస్ తో చర్చలు జరుపుతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య పెద్దపల్లిలో రైతులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడుతారు. తర్వాత పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్ చేరుకొని 8 గంటల వరకు పాదయాత్ర చేస్తారు.

20వ తేదీన నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ సందర్శన, బీడీ కార్మికులు, గల్ఫ్​కు వెళ్లిన కార్మికుల కుటుంబాలతో చర్చలు జరుపుతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఆర్మూర్ లో జరిగే పబ్లిక్ మీటింగ్​లో పాల్గొంటారు. పసుపు, చెరుకు రైతులతో చర్చలు జరుపుతారు. రాత్రి 7 గంటలకు నిజామాబాద్ చేరుకొని 8 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తర్వాత ఢిల్లీకి బయల్దేరుతారు.