
రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వ లొల్లి కొనసాగుతోంది. ఎంపీ రేవంత్‌రెడ్డి ఒకవైపు ఉంటే.. పలువురు సీనియర్లు మరో టీంగా ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి ఎవరికి వస్తుందన్న దానికంటే.. రేవంత్‌కు రాకుండా చూడటమే లక్ష్యంగా సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. ఆయనపై వారు హైకమాండ్కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తుంటే.. లోకల్ కేడర్, యువ లీడర్స్ మాత్రం రేవంత్వైపు చూస్తున్నారు.
చిచ్చురేపుతున్న పీసీసీ చీఫ్ పోస్టు.. రెండుగా చీలిన నేతలు
రేవంత్ ఒక్కడే టార్గెట్
చేతులు కలిపిన కాంగ్రెస్ సీనియర్లు
ఆ ఒక్కడికి ఇవ్వద్దంటూ హైకమాండ్కు ఫిర్యాదులు
రేవంత్ వైపు మొగ్గు చూపుతున్న లోకల్కేడర్, యువ లీడర్స్
పీసీసీ మార్పు ఇప్పట్లో లేదంటున్న ఏఐసీసీ వర్గాలు
హైదరాబాద్, వెలుగు: ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త కుంపటి రాజేసింది. ఎంపీ అయ్యాక రేవంత్‌కు ప్రాధాన్యం పెరగటం.. పీసీసీ రేసులో ఆయన పేరు వినపడ్డప్పటి నుంచీ పార్టీలోని ముఖ్య నేతలు చేతులు కలిపారు. వీరిలో పలువురు ముందునుంచీ ఆయన ఎంట్రీని వ్యతిరేకించినవాళ్లే. దీంతో రేవంత్‌రెడ్డి పార్టీ లీడర్లతో సంబంధం లేకుండా సపరేట్ రూట్ ఎంచుకున్నారు. అవకాశం దొరికినప్పుడు అధికార పార్టీపై విరుచుకుపడుతూ తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మార్పుపై ప్రచారం జరగడం.. దాని కోసం ఢిల్లీ స్థాయిలో రేవంత్ ప్రయత్నాలు చేయటం మిగతా లీడర్లకు సెగ పెట్టినట్లయింది. అప్పట్నుంచీ తమలో ఎవరికి పదవి దక్కినా ఫర్వాలేదు.. రేవంత్‌కు రాకుండా అడ్డుకోవటమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌లోని సీనియర్లందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో గాంధీభవన్‌కు దూరంగా ఉంటూ రేవంత్ పావులు కదుపుతుండటం, గాంధీభవన్ కేంద్రంగా మిగతా లీడర్లు రేవంత్ తప్పులు వెతుకుతుండటం పార్టీ కేడర్‌లో ఉత్కంఠ రేపుతోంది.
నాలుగేండ్లుగా పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచే పీసీసీ చీఫ్ మార్పుపై చర్చ జరుగుతోంది. రెండేండ్ల కిందట రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికలప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన గొంతు వినిపించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై ఘాటైన విమర్శలు గుప్పిస్తూ, పంచ్ డైలాగులతో పార్టీ కేడర్‌లో పట్టు సంపాదించుకున్నారు. సభలో ఆయన మాట్లాడుతున్నంత సేపు ‘రేవంత్ రెడ్డి జిందాబాద్’ అంటూ నినాదాలు మారుమోగేవి. ఒక దశలో అవి ‘సీఎం రేవంత్’ అనే వరకు వెళ్లాయి. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే రిపీట్ అయింది. చాలా చోట్ల యువ నేతలూ రేవంత్ వైపు ఆకర్షితులయ్యారు. పార్టీలోని కొందరు లీడర్ల వారసులు, చోటా లీడర్లు కూడా ఆయనవైపే చూస్తున్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ అయితేనే రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని వారంతా నమ్ముతున్నారు. ఆయనే కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కోగలరనే విశ్వసిస్తున్నారు. ఆయనను యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌గా చూస్తున్నారు. యురేనియం ఇష్యూలో రేవంత్ తీసుకున్న స్టాండ్, యాక్టివిటీ కూడా పార్టీలోని లోకల్ లీడర్స్‌ను ఆయనవైపు తిప్పుకుంది. అప్పట్లో రేవంత్ దూకుడుపై కొందరు సీనియర్లు ఓపెన్‌గానే అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమయంలో రేవంత్ నిర్ణయం అప్పట్లో పార్టీలో తీవ్ర దుమారం రేపింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ తన భార్య పద్మావతిని క్యాండిడేట్‌గా ప్రకటించగా.. రేవంత్ కూడా మరో క్యాండిడేట్‌ను ప్రతిపాదించారు. అటు తర్వాత పద్మావతికే హైకమాండ్ టికెట్ కన్ఫాం చేసింది. కొన్నిరోజులు మౌనంగా ఉన్న రేవంత్.. తర్వాత పద్మావతికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తర్వాత రేవంత్ మాట తీరులో మార్పు కనిపించింది. గతంలో తీవ్ర పదాలను ఉపయోగించే ఆయన.. తర్వాత సూటిగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
రేవంత్‌కు ఇస్తామంటే ఎట్ల?
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రేవంత్ పీసీసీ అధ్యక్షుడైతేనే కాంగ్రెస్ బతుకుతుందని కొందరు నేతలు వాదిస్తుంటే.. కాంగ్రెస్‌లో వన్‌మ్యాన్ షోలు కుదరవని సీనియర్లు అంటున్నారు. లాయల్టీ చాలా ముఖ్యమని, పార్టీకి ఎంతో సేవ చేసిన వారికే ఉన్నత పదవులు దక్కుతాయని చెబుతున్నారు. రేవంత్ కాంగ్రెస్ కేడర్, లీడర్స్‌తో ఇంకా కలిసిపోలేకపోతున్నారని, టీడీపీలో తనతో ఉన్న వారినే ఇప్పుడు కూడా చుట్టూ తిప్పుకుంటున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఆవేశంతో ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకి మంచివి కావని విమర్శిస్తున్నారు. ఓటుకు నోటు కేసును ఎదుర్కొంటున్న రేవంత్‌కు పీసీసీ చీఫ్‌గా చాన్స్ రాదని వాదిస్తున్నారు. కాంగ్రెస్‌లో హైకమాండ్కు లాయల్‌గా ఉన్న నేతలెందరో ఉండగా ఆయనకు అవకాశం దక్కదని నమ్ముతున్నారు. కొందరైతే సీనియర్లమైన తమకు పీసీసీ పదవి ఇవ్వకపోయినా సరే కానీ.. రేవంత్‌కు మాత్రం ఇవ్వొద్దని పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
మార్పు ఇప్పట్లో లేనట్లేనా?
పీసీసీ పదవి కోసం ఇక్కడ పోటాపోటాగా రేసు కొనసాగుతున్నా హైకమాండ్ నుంచైతే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాలేదు. మరో ఆరు నెలల పాటు హైకమాండ్ ఈ విషయంపై దృష్టి సారించే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించిన అనంతరమే హైకమాండ్ రాష్ట్ర పీసీసీ పదవిపై దృష్టి సారిస్తుందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. పీసీసీని ఎన్నుకునేందుకు హైకమాండ్ కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, అన్ని రకాల ఈక్వేషన్లు బేరీజు వేసుకున్న తర్వాత పార్టీ చీఫ్ ఎవరో నిర్ణయిస్తుందన్నారు. అంతిమంగా, ఎవరెన్ని చెప్పినా..హైకమాండ్ దృష్టిలో ఉన్నవారికే పగ్గాలు దక్కుతాయని ఆయన అసలు విషయం తేల్చేశారు.
తమకే ఇవ్వాలంటున్న సీనియర్లు
జూనియరైన రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవెలా వస్తుందని సీనియర్లు అంటున్నారు. కాంగ్రెస్‌కు ముందునుంచీ కట్టుబడి ఉన్న వాళ్లకే ఆ పదవి ఇవ్వాలని, నిన్న మొన్ననే బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ పోస్టు తమకే ఇవ్వాలంటూ ఇప్పటికే సీనియర్లు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాము రేసులో ఉన్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓపెన్‌గానే చెప్పకుంటున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేర్లూ తెరపైకి వచ్చాయి. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా పీసీసీ ఆశిస్తున్నట్లు ప్రచారం. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తమకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు పదవి ఇస్తే ఆ అవకాశం తనకే ఇవ్వాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పీసీసీ చీఫ్ రేసు ఎవరికి దక్కుతుందనేది రాష్ట్ర కాంగ్రెస్ కేడర్‌లో ఆసక్తి రేపుతోంది.
ప్లస్‌లు
ధాటిగా మాట్లా డటం
జనాన్ని ఆకట్టుకునేలా డైలాగులు
యంగ్ లీడర్, జనాకర్షక నేత
అనుచరుల్ని బాగా చూసుకోవడం
కా ర్యకర్తల బాగోగులపై శ్రద్ధ
కేసీఆర్ ను ఢీకొట్టగల నేతగా గుర ్తింపు
అపోజిషన్ పార్టీల్లో గట్టి లీడర్ సొంతంగా నిధులు సమకూర్చుకోగల సత్తా
కులం
మైనస్‌లు
ఓటుకు నోటు కేసు
వన్‌మ్యా న్ షో
పా త అనుచరులనే దగ్గరపెట్టుకోవడం
ఒరిజినల్ కాంగ్రెస్ కలిసిపోలేకపోవడం
ఆవేశంలో అనుచిత వ్ యాఖ్యలు
పార్టీ లు మా రడం
కాంగ్రెస్ కు కొత్త