నామినేటేడ్ పోస్టులకు ఫుల్ డిమాండ్

నామినేటేడ్ పోస్టులకు  ఫుల్ డిమాండ్
  • డీసీసీ, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులపై సీనియర్ల ఆసక్తి
  •  కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పోస్ట్ కోసం పైరవీలు
  •  జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్, మంత్రుల ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుతాయనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. డీసీసీ చైర్మన్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు ఇన్నాళ్లు కాంగ్రెస్ లీడర్ల నుంచి డిమాండ్ ఉండగా.. తాజాగా పురుమల్ల శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటుతో కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి పోస్టు కూడా లిస్టులో చేరింది. ఈ మూడు పదవుల్లో ఏదో ఒకటి దక్కించుకునేందుకు కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారు. ఆశావహులు జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

డీసీసీ అధ్యక్ష పీఠంపై వెలిచాల గురి.. 

ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన నియోజకవర్గానికే ఎక్కువ పరిమితమవుతున్నారు. ఇటీవల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో బిజీగా ఉంటున్న ఆయనకు పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణం, సమన్వయం కొంత ఇబ్బందికరంగానే మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడి మార్పుపై చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 ప్రధానంగా ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావుతోపాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పీసీసీ సెక్రటరీ వైద్యుల అంజన్ కుమార్ పోటీపడుతున్నారు.  వీరిలో సౌమ్యుడిగా పేరున్న, జిల్లా కాంగ్రెస్ శ్రేణులను సమన్వయం చేయగలిగిన వెలిచాల రాజేందర్ రావు వైపే జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వెలిచాల రాజేందర్ రావు మాత్రం తనకు డీసీసీ అధ్యక్ష పదవితోపాటు కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పదవి కూడా ఇవ్వాలనే షరతు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.  

నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పదవి దక్కేదెవరికో.. 

డీసీసీ ఆఫీసులో జరిగిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పురుమల్ల శ్రీనివాస్ ను ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పోస్టు ఖాళీ అయింది. వాస్తవానికి పురుమల్ల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిగా ఉన్నన్ని రోజులు మంత్రి పొన్నంను దూషించడం ద్వారా వార్తల్లో ఉన్నారే తప్పా..  పదవికి తగినట్లుగా పార్టీ కార్యక్రమాలతో ఉనికిని చాటుకోలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి.

నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పోస్టు దక్కించుకుంటే భవిష్యత్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఈ పోస్టు కోసం కరీంనగర్ కాంగ్రెస్ లీడర్లు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. ఈ పదవి కోసం ప్రధానంగా వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీగా ఓడిపోయాక నియోజకవర్గ రాజకీయాలపై దృష్టి సారించిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మధ్య పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది.   

కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ పోస్టుకు ఫుల్ డిమాండ్.. 

జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూరు, శంకరపట్నం మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు కొలువుదీరినప్పటికీ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక పూర్తి కాలేదు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం పీపీసీ సెక్రటరీ వైద్యుల అంజన్ కుమార్, తిమ్మాపూర్ కాంగ్రెస్ నేత సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్(ఎస్ఎల్ గౌడ్) ప్రధానంగా పోటీపడుతున్నారు.  ఈ కమిటీలో కరీంనగర్, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లకు డైరెక్టర్ పోస్టులు దక్కనున్నాయి.