అధీర్ రంజన్ కాంగ్రెస్ సోల్జర్: ఖర్గే

అధీర్ రంజన్ కాంగ్రెస్ సోల్జర్: ఖర్గే

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశంసలు కురిపించారు. అధీర్ రంజన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడే సైనికుడని పొగిడారు. ఖర్గే సోమవారం మీడియాతో మాట్లాడారు." నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడదలచుకోలేదు. అధీర్ రంజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సైనికుడు. పశ్చిమ బెంగాల్‌‌లో కాంగ్రెస్ సీనియర్ లీడర్. వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తుపై కొందరు టీఎంసీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న అభిమానాన్ని తగ్గించేందుకు కట్ర చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఏవి ఫలించవు. బెంగాల్ లో మా పార్టీ బలంగానే ఉంది" అని ఖర్గే అన్నారు.  

అసలేం జరిగిందటే..!

లోక్ సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తామని తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌(టీఎంసీ) ప్రకటించడంపై ఖర్గే, అధీర్‌‌ రంజన్‌‌ చౌదరి మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. మమత మద్దతు తీసుకోవాలా వద్దా అనేది పార్టీ హైకమాండ్‌‌ నిర్ణయం తీసుకుంటుందని, అధీర్‌‌ కాదని ఖర్గే వ్యాఖ్యానించారు. దాంతో ఆదివారం కోల్‌‌కతాలో పలుచోట్ల ఖర్గే పోస్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు ఇంకు చల్లి ‘ఖర్గే తృణమూల్‌‌ ఏజెంట్‌‌’ అని రాశారు. ఈ ఘటనను అధీర్‌‌ ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇంక్ చల్లిన పోస్టర్లను వెంటనే తొలగించాలని కోరారు. 

మమత అవకాశవాద రాజకీయ నాయకురాలని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ను అంతం చేయడమే ఆమె లక్ష్యమని ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ ను మమత వ్యక్తిగత ఎజెండా కోసం ఉపయోగించడం తమకు ఇష్టం లేదన్నారు. ఖర్గే తన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడినా రాష్ట్రంలోని అట్టడుగు స్థాయి కాంగ్రెస్ కార్యకర్త తరఫున తాను పోరా డుతానని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఖర్గే పై విధంగా స్పందించారు.