
- ఎర్రవల్లిలో ఒకే వేదికపై చేసేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రయత్నాలు
- కాంగ్రెస్ ఏర్పాట్లను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు
- పోటాపోటీగా రెండు పార్టీల కార్యకర్తల నినాదాలు
- రచ్చబండకు అనుమతి ఇవ్వని పోలీసులు
సిద్దిపేట/ గజ్వేల్, వెలుగు: కాంగ్రెస్ సోమవారం రచ్చబండ చేయనున్న స్థలంలోనే టీఆర్‌ఎస్ మౌన దీక్షకు దిగుతుండటంతో సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మర్కుక్ మండలం ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ అదే ప్లేస్‌లో మౌన దీక్ష కార్యక్రమానికి రెడీ అవుతోంది. ఒకే స్థలంలో రెండు పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రచ్చబండ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎర్రవల్లి వెళ్లిన కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ అన్వేశ్ రెడ్డిని, డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నేతలు, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ గో బ్యాక్, కేసీఆర్ జిందాబాద్ అని టీఆర్‌ఎస్ నేతలు, టీఆర్‌ఎస్, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రెండు పార్టీల నేతలు, కార్యకర్తలను సముదాయించడానికి గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు ప్రయత్నించారు. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని నర్సారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడం కోసమే రేవంత్ రచ్చబండ నిర్వహిస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు.
టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో టెంట్లు
రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి కాంగ్రెస్ నేతలు వెళ్లిన తరువాత అదే ప్రాంతంలో టీఆర్‌ఎస్ నేతలు టెంట్లు వేశారు. ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి రోడ్డును మూసేసి, ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలో మౌనదీక్ష చేసి గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక, రచ్చబండకు పోలీసులు ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున జనసమీకరణతో నిర్వహించే ఏ విధమైన కార్యక్రమాలను అనుమతించబోమని గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఎవరైనా నిర్వహించే ప్రయత్నం చేస్తే అరెస్టు చేస్తామని చెప్పారు. కాగా, టీఆర్‌ఎస్ మౌనదీక్షకు పర్మిషన్ ఇస్తారా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.