ఉత్కంఠ.. ఆందోళన..పాలమూరుకార్పొరేషన్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన కాంగ్రెస్

ఉత్కంఠ.. ఆందోళన..పాలమూరుకార్పొరేషన్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన కాంగ్రెస్
  • టి మధ్యాహ్నం వరకు రెండో విడత జాబితా విడుదల
  • సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు కేటాయించిన కమిటీ
  • మద్దతుదారులతో కలిసి డీసీసీ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగిన ఆశావహులు

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: మహబూబ్​నగర్​ కార్పొరేషన్​ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు పెద్ద మొత్తంలో పోటీ పడుతుండడంతో.. ఎవరిని ఫైనల్​ చేయాలో తెలియక లీడర్లకు చెమటలు పడుతున్నాయి. ఒకరికి టికెట్​ ఇచ్చి, మరొకరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.

నామినేషన్ల విత్​డ్రాకు ఒక రోజు మాత్రమే టైం ఉండడంతో రాష్ట్ర స్థాయి లీడర్లతో మంతనాలు జరుపుతున్నారు. రెబల్స్​ లేకుండా ఒకే క్యాండిడేట్​ను రంగంలోకి దింపేలా చూసేందుకు, అవసరమైతే భవిష్యత్​లో పదవులు ఇస్తామని హామీ ఇచ్చి రాజీ కుదిర్చేందుకు లీడర్లు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్​ ఫస్ట్  లిస్ట్​ రిలీజ్..

మహబూబ్​నగర్​ కార్పొరేషన్​కు కాంగ్రెస్​ పార్టీ నుంచి 60 స్థానాలకు గాను 328 మంది ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో స్థానానికి నలుగురు నుంచి ఐదుగురు పోటీ పడ్డారు. వీరిలో 112 నామినేషన్లను వివిధ కారణాలతో రిజెక్ట్​ చేయగా, 216 మంది నామినేషన్లు సజావుగా ఉన్నట్లు తేలింది.

వీరిలో నుంచి 60 మందిని ఫిల్టర్​ చేయాల్సి ఉండగా, సోమవారం మధ్యాహ్నం మొదటి జాబితాను డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్  కార్పొరేషన్  చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్​తో కూడిన కమిటీ ప్రకటించింది.

కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, జిల్లా ఇన్​చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఆమోదం మేరకు జాబితాను మీడియాకు రిలీజ్​ చేశారు. 36 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేయగా, మిగిలిన 24 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మంగళవారం మధ్యాహ్నం వరకు రెండో విడత జాబితాను ప్రకటించే చాన్స్​ ఉంది. కాగా, ఫైనల్​ చేసిన 36 డివిజన్లలో 22 స్థానాల్లో  మహిళలకు అవకాశం కల్పించారు. ఇందులో జనరల్​ స్థానాల్లోనూ మహిళా లీడర్లు పోటీకి సిద్ధమవుతున్నారు. 

సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు

మహబూబ్​నగర్​ కార్పొరేషన్​కు మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో చాలా మంది కార్పొరేటర్​గా పోటీ చేసి చరిత్రకెక్కాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆయా డివిజన్​లలో నాయకులు గ్రౌండ్​ వర్క్​ చేసుకున్నారు. వారిని కాదని కొత్తగా కొందరు లీడర్లు తెరమీదకు వచ్చారు. తమకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్​ వద్ద డిమాండ్​ పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్​కు ముందు అధికార పార్టీ ఆయా డివిజన్లలో పోటీ చేయాలనుకుంటున్న లీడర్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంది.

వెయ్యికిపైగా అప్లికేషన్లు రావడంతో సర్వేలు చేయించింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి సైతం ప్రత్యేక టీమ్​లతో సర్వే జరిపించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. సర్వే రిపోర్ట్​, కమిటీ నివేదికల ఆధారంగా పార్టీ హైకమాండ్​ 36 మంది క్యాండిడేట్ల పేరుతో మొదటి విడత జాబితాను ఫైనల్​ చేసింది. వీరికి పార్టీ నుంచి బీ ఫారాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

డీసీసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..

వివిధ డివిజన్లలో టికెట్లు తమకే వస్తాయని ఆశలు పెట్టుకున్న ఆశావహులు తమ పేరు ఖరారు కాకపోవడంతో ఆందోళనకు దిగారు. పలువురు ఆశావహులు తమ మద్దతుదారులతో నగరంలోని కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​ను ముట్టడించారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 30వ డివిజన్  నుంచి మాజీ కౌన్సిలర్  ఉమర్​ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. సిట్టింగ్​ కౌన్సిలర్​ను కాదని, బీఆర్ఎస్​ నుంచి పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్​ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ఒకటో డివిజన్​ నుంచి మేగ్యా నాయక్​​మద్దతుదారులు ట్రాక్టర్లలో పార్టీ ఆఫీసుకు చేరుకొని, టికెట్​ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆ డివిజన్​కు అభ్యర్థిని ఖరారు చేయకపోయినా, బీఆర్ఎస్​ నుంచి వచ్చిన లీడర్​కు టికెట్​ కేటాయిస్తున్నారనే ప్రచారం జరగడంతో నిరసనకు దిగారు. అలాగే 12వ డివిజన్​కు సంబంధించిన అభ్యర్థిని కన్​ఫాం చేయకపోయినా కొందరు లీడర్లు ఆందోళనకు దిగారు.

గద్వాలలో బుజ్జగింపులు..

గద్వాల: మున్సిపాలిటీ ఎన్నికల్లో రెబల్స్, ఇండిపెండెంట్  క్యాండిడేట్లను బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కుల సంఘాలతో పాటు డబ్బులు ఆశచూపించి అభ్యర్థులను విత్ డ్రా చేయించేందుకు తిప్పలు పడుతున్నారు. గద్వాలలో 37 వార్డులకు 306  నామినేషన్లు దాఖలయ్యాయి. అలంపూర్ లో 10 వార్డులకు 59, అయిజలో 20 వార్డులకు 103, వడ్డేపల్లిలో 10 వార్డులకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 77 వార్డులకు 525 నామినేషన్లు రావడంతో పోటీ ఎక్కువగా ఉంది. ఈక్రమంలో చైర్మన్  అభ్యర్థులు పోటీ చేస్తున్న వార్డులపై ఫోకస్  పెట్టారు. తమ వార్డులో ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలవాలనే ఉద్దేశంతో అక్కడ బరిలో ఉన్న వారిని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నామినేషన్​ వేసిన వారి బంధుమిత్రులు, కుల సంఘాల పెద్దలతో మాట్లాడి ఒప్పించేందుకు తంటాలు పడుతున్నారు.

రెబల్స్ పై ఫోకస్..

గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్  రెబల్స్  ఎక్కువగా ఉండడంతో వారిని తప్పించేందుకు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్  సరిత రంగంలోకి దిగారు. రెండు వర్గాల మధ్య టికెట్ల పంచాయతీ ఉండడంతో సరిత వర్గానికి చెందిన వారు 13 మంది బీఆర్ఎస్ లో చేరారు. వారిని పక్కన పెట్టి మిగిలిన రెబల్స్  అభ్యర్థులను బరిలో నుంచి తప్పించేందుకు ముగ్గురు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఎమ్మెల్యే ఇంటికి ఏఐసీసీ సెక్రటరీ వెళ్లి రెండు వర్గాలను సమన్వయం చేసి కొందరిని బరిలో నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విభేదాలతో ప్రతిపక్షాలకు లాభం జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. సరిత వర్గానికి 10 వార్డులు, ఎమ్మెల్యే వర్గానికి 20 వార్డులు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చేందుకు ఇద్దరితో మంతనాలు జరుపుతున్నారు. ఈ చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

రాజీ కుదిర్చేందుకు తంటాలు..

చైర్మన్  పదవికి సైతం పోటీ తీవ్రంగా ఉన్న క్రమంలో, పార్టీ నేతలే వారిని ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వివిధ పార్టీల నేతలు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయిజ మున్సిపాలిటీలో 12, 13 వార్డుల్లో చైర్మన్  అభ్యర్థిగా మేకల అనిత, ఆమె భర్త మేకల నాగిరెడ్డి బరిలో ఉన్నారు. 19వ వార్డు నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి బరిలో నిలిచారు. వీరిని బుజ్జగించేందుకు పార్టీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. గద్వాలలోనూ చైర్మన్  అభ్యర్థులు బరిలో ఉన్న చోట వారిని సమన్వయం చేసేందుకు తంటాలు పడుతున్నారు.

వడ్డేపల్లి బీఆర్ఎస్ లో చీలికలు..

వడ్డేపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ నేతలు వడ్డేపల్లి శ్రీనివాసులు, మాజీ మున్సిపల్  చైర్మన్  కరుణశ్రీ భర్త సూరి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో సూరి వర్గానికి బీఆర్ఎస్  అధిష్టానం టికెట్లు ఇచ్చింది. దీంతో వడ్డేపల్లి శ్రీనివాసులు వర్గం 9 మందిని ఆల్  ఇండియా ఫార్వర్డ్  బ్లాక్  నుంచి బరిలో నిలిపారు.