భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా రిజర్వేషన్ల అంశం దశాబ్దాలుగా నలుగుతున్న ఒక సుదీర్ఘ స్వప్నం. ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు ఆమోదం ఒక చారిత్రక ఘట్టంగా ప్రచారం పొందుతున్నప్పటికీ.. దశాబ్దాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ చట్టం.. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న వెనకబడిన తరగతుల (ఓబీసీ) మహిళల పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పం గొప్పదే.
అయినా, దాని వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు, సామాజిక వర్గాలవారీగా జరుగుతున్న అన్యాయం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ‘అందరికీ సమాన అవకాశాలు’ అని రాజ్యాంగం ఘోషిస్తున్నా, చట్టసభల వాకిట ఓబీసీ మహిళలకు ప్రవేశాన్ని నిరాకరించడం సామాజిక న్యాయం అనే భావనకే గొడ్డలి పెట్టు. ఓబీసీ సబ్ కోటా లేని మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ఉన్నత వర్గాల మహిళలకే పట్టం కట్టే దిశగా సాగుతోందన్న విమర్శల్లో వాస్తవం లేకపోలేదు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం, ముఖ్యంగా మహిళల వాటా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడతాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఒక్క ఓబీసీ మహిళ కూడా పార్లమెంటులో అడుగుపెట్టకపోవడం అత్యంత శోచనీయం. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీ జపం చేస్తాయి తప్ప, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో విఫలమయ్యాయి. ఆర్థికబలం, అంగబలం ఉన్న అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన మహిళలే ఎక్కువగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఓబీసీ మహిళా నేతలు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నారు తప్ప, పార్లమెంట్ గడప తొక్కలేకపోతున్నారు.
గీతా ముఖర్జీ కమిటీ సిఫార్సులు- విస్మరించిన వాస్తవాలు
1996లో మహిళా రిజర్వేషన్లపై లోతైన అధ్యయనం చేసిన మొట్టమొదటి కమిటీ గీతా ముఖర్జీ కమిటీ. ఆనాటి ప్రధాని హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పరిశీలించిన ఈ కమిటీ.. స్పష్టమైన, దూరదృష్టితో కూడిన నివేదికను సమర్పించింది. ఇందులోని కొన్ని సిఫార్సులను పరిశీలిస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలి. నేటి పాలకులు గీతా ముఖర్జీ కమిటీ నివేదిక గురించి గొప్పగా చెబుతారు. కానీ, అందులోని ఓబీసీ కోటా ప్రస్తావన వచ్చేసరికి మౌనం వహిస్తారు. ఈ విషయాన్ని నేడు మోదీ ప్రభుత్వం విస్మరించడం విడ్దూరం.
కాంగ్రెస్ ‘మానస పుత్రిక’.. రాజీవ్ గాంధీ దార్శనికత
మహిళా రిజర్వేషన్ల అంశం నేడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పోరాటం ఉంది. స్థానిక సంస్థల్లో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విప్లవం తీసుకొచ్చారు. 1989లో స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన బిల్లును తెచ్చారు. అప్పట్లో విపక్షాలు అడ్డుకున్నా, తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని చట్టంగా మార్చింది. నేడు దేశంలో లక్షలాది మంది మహిళా సర్పంచులుగా ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ దార్శనికత వల్లేనన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ సంకల్పాన్ని కూడా విస్మరించలేం.
2013లో అధికారంలో ఉన్న యూపీఏ హయాంలో సోనియా గాంధీ పట్టుబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేశారు. అప్పుడు ఓబీసీ కోటా కోసం కొన్ని పార్టీలు పట్టుబట్టడంతో ఏకాభిప్రాయం కోసం వేచి చూశారు తప్ప, బీసీలకు అన్యాయం చేయాలని కాంగ్రెస్ ఏనాడూ భావించలేదు. నేడు రాహుల్ గాంధీ బాహాటంగానే ‘గతంలో మేం చేసిన బిల్లులో ఓబీసీ కోటా లేకపోవడం ఒక లోపం, దానిని ఇప్పుడు సరిదిద్దాలి’ అని చెబుతుండటం మా చిత్తశుద్ధికి నిదర్శనం. కానీ, బీజేపీ ప్రభుత్వం ఆ తప్పును సరిదిద్దకపోగా దానిని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం శోచనీయం.
‘పొలిటికల్ డ్రామా’
ప్రధాని మోదీ ప్రభుత్వం హడావుడిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలనుకోవడం వెనుక ఉన్న అసలు కారణం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే తపనే తప్ప.. ఆ మహిళా బిల్లుపై వారికి చిత్తశుద్ధి లేదు. జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీల జనాభా లెక్కలను బయటపెట్టడానికి మోదీ ప్రభుత్వం భయపడుతున్నది ఎందుకు? మహిళా బిల్లును తక్షణమే అమలు చేసే ఉద్దేశం లేనప్పుడు, అంత హడావుడిగా బిల్లును ఎందుకు తెచ్చారు? కేవలం మహిళా ఓటర్ల దృష్టిని మళ్లించడానికి, తాము మహిళా పక్షపాతులమని చెప్పుకోవడానికి మాత్రమే ఈ 'ఈవెంట్ మేనేజ్మెంట్' చేశారనేది ప్రధాన విమర్శ.
ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో తరచుగా తాను ఓబీసీ వర్గానికి చెందినవాడినని చెప్పుకుంటారు. కానీ, తన హయాంలో వస్తున్న అత్యంత కీలకమైన చట్టంలో తన సొంతవర్గమైన ఓబీసీ మహిళలకు చోటు కల్పించకపోవడం చారిత్రక తప్పిదం. ఓబీసీ సబ్ కోటా లేకపోతే చట్టసభలు కేవలం ఉన్నత వర్గాల మహిళల అడ్డాగా మారిపోతాయని గుర్తెరగాలి. అంతేకాదు.. కూలీ పనులు, చిన్న తరహా వృత్తులు చేసుకునే ఓబీసీ మహిళల సమస్యలు పార్లమెంట్ మెట్లు ఎక్కవు. సామాజిక అసమానతల్లో మగ్గుతున్న బీసీలకు న్యాయం చేయని ఏ నాయకుడైనా చరిత్రహీనుడిగా మిగిలిపోక తప్పదు.
ఓబీసీ కోటా లేని బిల్లు నిరర్థకం
ఓబీసీ సబ్ కోటా లేని మహిళా రిజర్వేషన్ బిల్లు సారం లేని చట్టమే అవుతుంది. అది ఒక అందమైన మేకప్ లాంటిదే తప్ప, అట్టడుగు వర్గాల మహిళల జీవితాల్లో వెలుగులు నింపే దివిటీ ఎప్పటికీ కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కులగణన జరపాలి. ఆ తర్వాతే.. మహిళా రిజర్వేషన్లలో 33 శాతంలో అంతర్గతంగా ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన కోటా కేటాయించాలి. ఇప్పటికైనా కేంద్రం గీతా ముఖర్జీ కమిటీ సూచనల ప్రకారం మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ సబ్ కోటాను చేర్చాలి. ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలం కంటే సామాజిక భాగస్వామ్యం ముఖ్యం. ఆ దిశగా అడుగులు పడనంత కాలం ఈ రిజర్వేషన్లు అసంపూర్ణమే.!
ఇందిరా శోభన్, కాంగ్రెస్ సీనియర్ నేత
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.

