తెలంగాణ రాకుంటే కేసీఆర్ గులాబీలు, చుడువా అమ్ముకుంటుండె

తెలంగాణ రాకుంటే కేసీఆర్ గులాబీలు, చుడువా అమ్ముకుంటుండె

కేసీఆర్ నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. కేసీఆర్ మునుగోడు సభలో బట్టెబాజ్ లెక్క మాట్లాడిండన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ చాలా మందిని ముంచిండన్న ఆయన.. ఆలే నరేందర్, కొండా లక్ష్మణ బాపూజీ, విజయశాంతిలను మోసం చేసిండని చెప్పుకొచ్చారు. కేసీఆర్ వందేళ్ళు తలకిందులు చేసినా తెలంగాణ వచ్చేది కాదని మధుయాష్కి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాకముందు నీ ఆస్తులెంత.. ఇప్పుడెంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యమం పేరుతో ఆస్తులు పెంచుకున్నావని, నీ ముఖానికి సీఎం అయ్యేటోడివా అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

చెట్ల సంతోష్ గాడు ఎక్కడుండే.. అమెరికాలో నౌకరీ చేసుకునేటోడు మంత్రి అయ్యిండు... విదేశాల్లో ఉండే కవితను లీడర్ ను చేసినవ్ అంటూ మధుయాష్కీ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిన్న మాట్లాడిన భాషను చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని... హైదరాబాద్ తో తెలంగాణ ఇస్తే.. ఆగం చేసినవని ఆరోపించారు. చివరికి అప్పుల రాష్ట్రంగా చేసినవ్ అంటూ ఆయన కోపం వెల్లగక్కారు. 

సోనియా అపాయింట్ మెంట్ దొరక్క ఢిల్లీలో రోడ్లపై తిరిగినవని... ఇప్పుడేమో బాత్ రూమ్ లకు బులెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకుంటున్నావని మధుయాష్కి అన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందన్న ఆయన.. సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముకునే దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆరోపించారు. రాజగోపాల్ రాజీనామాను 5నిమిషాల్లో ఎట్లా ఆమోదిస్తావని ప్రశ్నించారు. బీజేపీ, టీఆరెఎస్ ల మధ్య చీకటి ఒప్పందం వుందన్న ఆయన... కేసీఆర్ కుటుంబం పై సీబీఐ విచారణ జరగడం లేదన్నారు. కాంగ్రెస్ ను లేకుండా చేయడానికే ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. 

యూనివర్సీటీలు మూత పడ్తున్నాయని... కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు, బంధువుల ఆస్తులు పెరుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్ బాల్యం గురించి ఎక్కడా మాట్లాడడన్నారు. పాస్ పోర్టుల బ్రోకర్ కేసీఆర్ అన్న మధుయాష్కి... సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ రాకుంటే మొహంజాహి మార్కెట్లో కేసీఆర్ గులాబీలు అమ్ముకునేటోడని సెటైర్ వేశారు. లేదంటే బార్ షాపుల్లో చుడువా అమ్ముకునే వాడన్నారు. వచ్చే మునుగోడు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని మధుయాష్కి పిలుపునిచ్చారు.