పాతబస్తీ జనహృదయ నేత ముఖేష్ గౌడ్ ఇక లేరు

పాతబస్తీ జనహృదయ నేత ముఖేష్ గౌడ్ ఇక లేరు

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేశ్‌గౌడ్‌ కన్నుమూశారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఆదివారం రాత్రి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనన్ను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

గత కొంతకాలంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్  కేన్సర్‌తో బాధపడుతున్నారు. 2018అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖేష్  అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖేష్ కి సుమారు ఏడూ సర్జరీ లు జరిగాయి. అయితే.. రోజురోజుకి ముఖేష్  ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వైద్యానికి ముఖేష్‌గౌడ్‌ శరీరం సహకరించపోవడంతో అపోలో డాక్టర్లు ట్రీట్ మెంట్  నిలిపివేసి జూబ్లీహిల్స్ లోని ముఖేష్ గౌడ్ నివాసానికి తరలించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ మాస్ లీడర్ గా మంచి గుర్తింపు పొందారు. యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగ్రేటం చేసి కౌన్సిలర్ గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారు. మజ్లీస్ హవా మాత్రమే నడిచే హైదరాబాద్ పాతబస్తీలో జనహృదయం గెలిచిన ప్రజానాయకుడు ముఖేష్. అన్ని మతాల, కులాల, భాషల ప్రజలు నివసించే మినీ ఇండియాగా పిలవబడే మహరాజ్ గంజ్ లో మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలవడం మామూలు విషయం కాదు.

అతి చిన్న వయసులో 1986లో కౌన్సిలర్ గా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం.1988లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1989,2004లో మహారాజ్ గంజ్ ఎమ్మెల్యేగా,2009 గోషామహల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.1994 ,1999 ,2014 ,2018 అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయారు.  2007లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, 2009లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ముఖేష్ గౌడ్ పనిచేశారు. జంట నగరాల్లో ముఖేష్ అంటే ఒక బ్రాండ్..మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కి స్వయానా మేనల్లుడు.

ముఖేష్ గౌడ్ జూలై 1,1959లో జన్మించారు. ఆయనకు  ఇద్దరు కుమారులు విక్రమ్ గౌడ్, విశాల్ గౌడ్, ఒక కుమార్తె శిల్పా ఉన్నారు. కుమారుడు విక్రమ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు.