
- క్లస్టర్-1లో తెలంగాణ,పలు సౌతిండియా రాష్ట్రాలు
న్యూఢిల్లీ, వెలుగు : లోక్‌సభ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ పార్టీ.. క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. దేశంలోని రాష్ట్రాలు/యూటీలను 5 క్లస్టర్లుగా విభజించి.. కమిటీలను నియమించింది. శుక్రవారం ఈ మేరకు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
తెలంగాణతో పాటు సౌతిండియాలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, లక్ష్యద్వీప్, పుదుచ్చేరిలను క్లస్టర్ –1లో చేర్చింది. ఈ క్లస్టర్‌కు చైర్మన్‌గా హరీశ్ చౌదరి, మెంబర్లుగా విశ్వజీత్ కడం, జిగ్నేశ్ మెవానీలను నియమించినట్లు పేర్కొన్నారు. క్లస్టర్ 2 లో ఏపీ, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ అండ్ నికోబార్ ఉన్నాయి. క్లస్టర్ –3 లో గుజరాత్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలను చేర్చారు. క్లస్టర్ –4 లో యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడాక్ ఉన్నాయి. క్లస్టర్ –5 లో బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలు ఉన్నాయి.
క్లస్టర్ –2కు మధుసూదన్ మిస్త్రీ, క్లస్టర్ –3కి రజని పాటిల్, క్లస్టర్–4కి భక్త చరణ్ దాస్, క్లస్టర్ –5 కు రాణా కేపీ సింగ్ లను చైర్మన్లుగా కాంగ్రెస్ నియమించింది. మరోవైపు ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆల్కా లాంబాను, ఎన్‌ఎస్‌యూఐ నేషనల్ ప్రెసిడెంట్‌గా వరుణ్ చౌదరిని నియమించింది.