బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై కాంగ్రెస్ కొట్లాడాలి..బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై కాంగ్రెస్ కొట్లాడాలి..బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

హసన్ పర్తి, వెలుగు: బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్లమెంట్​ వేదికగా  కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ కొట్లాడాలని రాష్ట్ర బీసీ జేఏసీ వర్కింగ్​ చైర్మన్​ జాజుల శ్రీనివాస్​గౌడ్​ కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని సూచించారు. కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఆరు రోజులుగా జరుగుతున్న బీసీల ధర్మ పోరాట దీక్ష శనివారం ముగిసింది. 

ఈ కార్యక్రమానికి జాజుల హాజరై మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లుపై చర్చించి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని డిమాండ్​ చేశారు. లేదంటే డిసెంబర్ మొదటి వారంలో వేలాది మందితో పార్లమెంటును దిగ్బంధిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమన్నారు. 

ఢిల్లీలో తమ పక్షాన కాంగ్రెస్ పోరాడితే దేశంలోని బీసీలంతా ఆ పార్టీకి అండగా ఉంటారన్నారు. బీసీ వ్యక్తి ప్రధానిగా ఉండి బీసీల డిమాండ్లను నెరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహలో పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బైరి రవికృష్ణ, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, డాక్టర్​ సంగాని మల్లేశ్వర్, డాక్టర్​ చిర్ర రాజుగౌడ్  పాల్గొన్నారు.