కందనూలు, వెలుగు: దేశ ఐక్యత కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువతరం ముందుకు సాగాలని గుజరాత్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పార్మాత్ జయంత్ సింగ్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం నాగర్ కర్నూల్ జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో పటేల్ 150వ జయంతి సందర్భంగా ఐక్యత మార్చ్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా ముండా ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా ముండా 150 జయంతితో పాటు వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐక్యత మార్చ్ నిర్వహిస్తోందని చెప్పారు. అనంతరం దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.
