IPL Retention 2026: 11 ఏళ్ళ అనుబంధానికి చెక్.. రూ.18 కోట్ల స్టార్ ఆల్ రౌండర్‌ను రిలీజ్ చేసిన KKR

IPL Retention 2026: 11 ఏళ్ళ అనుబంధానికి చెక్.. రూ.18 కోట్ల స్టార్ ఆల్ రౌండర్‌ను రిలీజ్ చేసిన KKR

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులోని జట్టు స్టార్ ఆల్ రౌండర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. దశాబ్ద కాలంగా కేకేఆర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రస్సెల్ కు ఈ సారి ఆ జట్టు ఫ్రాంజైజీలు రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. ఈ విండీస్ ఆల్ రౌండర్ ను ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు రిలీజ్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రస్సెల్.. గత సీజన్ లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో కేకేఆర్ రస్సెల్ ను వదులుకునేందుకు సిద్ధమైంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆండ్రీ రస్సెల్ 109 మ్యాచ్‌లు ఆడి 2593 పరుగులు చేశాడు. కేకేఆర్ తరపున బౌలింగ్ లోనూ రాణించి 122 వికెట్లు పడగొట్టాడు. రస్సెల్ జట్టులో ఉన్నప్పుడు కేకేఆర్ రెండు టైటిల్స్ కూడా గెలుచుకుంది. రస్సెల్ 2014 నుండి కేకేఆర్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ ముందు రస్సెల్ ను కేకేఆర్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. 2025 ఐపీఎల్ సీజన్ లో ఈ విండీస్ ఆల్ రౌండర్ 167 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు పడగొట్టాడు. వయసు ఎక్కువగా ఉండడంతో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం రస్సెల్ కు మైనస్ గా మారింది. 

2025లో అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2024 లో శ్రేయాస్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచింది. 2025 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు చేరకపోవడంతో 2026 ఐపీఎల్ సీజన్ లో కొత్త వ్యూహాలతో బరిలోకి దిగనుంది. 2026 ఐపీఎల్ సీజన్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ సిబ్బందిలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసింది. జట్టుకు కొత్త ప్రధాన కోచ్ గా అభిషేక్ నాయర్ నియమించిన కేకేఆర్.. గురువారం (నవంబర్ 13) షేన్ షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ప్రకటించింది. తాజాగా న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీని కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నారు.