మిడ్జిల్, వెలుగు: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. శనివారం మిడ్జిల్ లోని నల్ల చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏపీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మత్స్యకారులను మోసం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.123 కోట్లతో నాణ్యమైన చేప పిల్లలను ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. శిథిలావస్థకు చేరిన 389 చెరువులకు రిపేర్లు చేయించే విషయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బాదేపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ తంగెళలజ్యోతి, ఫిషరీస్ ఏడీ రాధా రోహిణి, మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోనెల శ్రీను పాల్గొన్నారు.
స్టడీ మెటీరియల్ అందజేత
జడ్చర్ల టౌన్: పట్టణంలోని జౌకీ నగర్ సెట్విన్ శిక్షణ కేంద్రంలో టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న 290 మంది మహిళా అభ్యర్థులకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శనివారం స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్లేందుకు శిక్షణ దోహదం
చేస్తుందన్నారు.
