మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: హైవేలు, ప్రధాన రోడ్లపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ఎస్పీ డి. జానకితో కలిసి పోలీస్, రవాణా, హైవే, అర్ఆండ్ బీ శాఖల అధికారులతో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై రివ్యూ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర రహదారులు, నేషనల్ హైవేలపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై వేగాన్ని నియంత్రించే రంబుల్ స్ట్రిప్ లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.
సైన్ బోర్డ్ లు, బ్రిడ్జిల వద్ద స్టిక్కర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సర్వీస్ రోడ్లలో లైట్లు, రోడ్లకు రిపేర్లు చేయాలని సూచించారు. బాలానగర్, మూసాపేట బ్రిడ్జి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. బాలానగర్, మూసాపేట, దివిటిపల్లి వద్ద కొనసాగుతున్న రోడ్డు పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు.
అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అడిషనల్ ఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పీఆర్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
