IPL Retention 2026: నటరాజన్ రిటైన్.. రూ.9 కోట్ల ఆసీస్ ఓపెనర్‌తో పాటు డుప్లెసిస్‌ను రిలీజ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

IPL Retention 2026: నటరాజన్ రిటైన్.. రూ.9 కోట్ల ఆసీస్ ఓపెనర్‌తో పాటు డుప్లెసిస్‌ను రిలీజ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా చిచ్చర పిడుగు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ను రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని రూ. 9 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అయితే గత సీజన్ లో ఈ ఆసీస్ ఓపెనర్  ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్ ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతను ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోయాడు. మెక్‌గుర్క్ లేకపోయినా ఢిల్లీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదు అని తెలుస్తోంది. ఈ ఆస్ట్రేలియా ఆటగాడి గురించి చాలా చర్చలు జరిగినప్పటికీ ఢిల్లీ యాజమాన్యం తనను కొనసాగించడానికి ఆసక్తి చూపించలేదు. 

ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్నప్పుడు భారత్, పాక్ ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన మెక్‌గుర్క్ ఇండియాకు రాలేదు. ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్ లకు ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 2024 ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టాడు. ఓపెనర్ గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ కారణంగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని రూ.9 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. 

మెక్‌గుర్క్ 2023లో దేశవాళీ క్రికెట్ లో కేవ‌లం 29 బంతుల్లోనే సెంచ‌రీ చేసి చ‌రిత్ర సృష్టించి వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలో లిస్ట్-ఏ (అంత‌ర్జాతీయ వ‌న్డేలు, దేశ‌వాలీ వ‌న్డే టోర్నీలు) క్రికెట్‌లో వేగ‌వంత‌మైన శ‌త‌కాన్ని న‌మోదు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. మొత్తంగా 38 బంతులు ఆడిన ప్రేజ‌ర్ 10 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో 125 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్ లో ఓపెనర్ గా వచ్చి పరుగుల వరద పారించి.. ఆసీస్ జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చిన అవకాశాలను వృధా చేసుకున్న ఫ్రేజర్ ఆసీస్ జట్టులో చోటు కోల్పోవడంతో పాటు ఐపీఎల్ లో కూడా అతన్ని రిటైన్ చేసుకోకుండా వదిలేసుకున్నారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ ఇండియా ఫాస్ట్ బౌలర్ నటరాజన్‌ను రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో రూ. 10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసినా ఎక్కువ మ్యాచ్ ల్లో ఆడే అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2025 సీజన్ లో కేవలం ఒక్క మ్యాచ్ కే పరిమితమయ్యాడు. దీంతో నటరాజన్ ను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగినా ఈ తమిళనాడు పేసర్ పై ఢిల్లీ క్యాపిటల్స్  నమ్మకముంచింది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్.. ఫాఫ్ డుప్లెసిస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ సఫారీ ఆటగాడిని రూ.2 కోట్ల ధరకు క్యాపిటల్స్ దక్కించుకున్నా గత సీజన్ లో నిరాశపరిచాడు.