కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకొని పోవాలె: డి.రాజా

కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకొని పోవాలె: డి.రాజా
  • రాజకీయ ప్రత్యామ్నాయం కోసం తప్పదు: డి.రాజా
  • బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రత్యామ్నాయ నిర్మాణంలో భాగంగా ఇతర లౌకిక, వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలను కలుపుకొని పని చేయడంపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. పరస్పర విశ్వాసం, సర్దుబాటుతో పని చేయడం లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు అలవరుచుకోవాలని సూచించారు. దేశాన్ని రక్షించాలంటే మితవాద, ఫాసిస్టు బీజేపీ, దాని మిత్ర పక్షాలను ఓడించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని అన్నారు. మంగళవారం హైదరాబాద్​లోని బండ్లగూడలో ప్రజాపక్షం ఐదో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభకు డి.రాజా ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. బీజేపీని ఓడించేందుకు రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు వామపక్షాలు, ప్రజాతంత్ర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

ఈ ప్రయత్నాలు సానుకూల పరిణామాలకు దారి తీస్తాయని ఆశిస్తున్నాయని, ఒకవేళ కాకుంటే నిరాశకు లోను కాబోమని చెప్పారు. దేశం ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ కాలం నుంచి పాలస్తీనాను ఇండియా సమర్థిస్తున్నదని, కానీ మోదీ హయాంలో ఇందుకు విరుద్ధమైన వైఖరిని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో పల్లా వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, కె. శ్రీనివాస్ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ, బీఎస్ఆర్ మోహన్ రెడ్డి, విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.