చెన్నూరు, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామిపై ఆదివారం బాల్క సుమన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంత్రిపై మరోసారి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చెన్నూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
గత బీఆర్ఎస్ హయాంలో చెన్నూరు మున్సిపాలిటీలో ఏ ఒక్క పని కూడా పూర్తికాలేదని, కమీషన్లు కోసమే ఆర్భాటాలతో ఓపెనింగ్ లు చేశారని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి వివేక్ రూ.కోట్ల నిధులు మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
మార్నింగ్ వాక్ లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మంత్రిపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వినయ్ కుమార్, కాంగ్రెస్ నేతలు చింతల శ్రీనివాస్, చెన్న సూర్యనారాయణ, కౌన్సిలర్లు సుశీల్ కుమార్, పి.సాగర్, ఎ.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

