శంకుస్థాపన చేసిన పనులకు బీఆర్ఎస్ హడావుడి...క్యాతనపల్లి మున్సి పాలిటీ లో కాంగ్రెస్ నిరసన

శంకుస్థాపన చేసిన పనులకు బీఆర్ఎస్ హడావుడి...క్యాతనపల్లి మున్సి పాలిటీ లో కాంగ్రెస్ నిరసన

కోల్​బెల్ట్, వెలుగు: మున్సిపల్​ ప్రజల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి శంకుస్థాపన చేసిన పలు అభివృద్ది పనులకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు​ మళ్లీ ప్రారంభోత్సవాలంటూ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ క్యాతనపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లోని పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్​ కౌన్సిలర్లు, లీడర్లతో కలిసి మాట్లాడారు. కొద్ది రోజుల కింద మంత్రి వివేక్​ క్యాతన పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో రూ.85.28కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారన్నారు. 

వీటితోపాటు కోట్లాది రూపాయలతో  వైకుంఠధామం, గ్రేవ్ యార్డులు, ఖబరస్తాన్, రోడ్లు, సెంట్రల్​లైటింగ్‌‌‌‌‌‌‌‌, చిల్డ్రన్స్‌‌‌‌‌‌‌‌ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్‌‌‌‌‌‌‌‌, డ్రింకింగ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రైనేజీల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం, మంత్రి వివేక్​ ఆమోదంతో చేపట్టిన పనులకు ప్రస్తుత పాలకవర్గంలోని బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు మళ్లీ కొబ్బరికాయలు కొడుతూ తామే పనులు చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ కౌన్సిలర్లు పుల్లూరి తిరుమల, దాముక శిరీష, గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేశ్​, ప్రభాకర్​, డీసీసీ సెక్రటరీ శ్రీనివాస్, లీడర్లు 
పాల్గొన్నారు.