కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక న్యాయం .. జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చోటు

కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక న్యాయం .. జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చోటు
  • జిల్లా మంత్రులు, ఇన్​చార్జీలకు రాష్ట్ర ఇన్​చార్జ్​మీనాక్షి నటరాజన్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక న్యాయం అమలుపై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ నెల 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, మండల, జిల్లా కమిటీలను నియమించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశించడంతో అన్ని జిల్లాల్లో కమిటీలపై కసరత్తు ముమ్మరం చేశారు. గత ఐదు రోజులుగా అన్ని జిల్లాల పార్టీ నేతలతో ఇన్​చార్జి మంత్రులు, ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్​చార్జులు సమావేశమై గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకంపై చర్చిస్తున్నారు. ఈ మూడు కమిటీల్లో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక మహిళ ఉండేలా చూడాలని పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ కమిటీల్లో విధిగా ఈ సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడంపై దృష్టి పెట్టారు. 

ఇదే సమయంలో ఎక్కడ వివాదం కాకుండా, సామరస్యపూర్వకంగా అందరి ఆమోదం మేరకే కమిటీల నిర్మాణం ఉండేలా నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ కార్యకర్తలకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా కమిటీల్లో అవకాశం దక్కేలా చూడాలని మీనాక్షి నటరాజన్​ సూచించారు. దీంతో గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఈ సామాజిక వర్గాల కార్యకర్తలను గుర్తించి వారిని కమిటీలో వివిధ పదవుల్లో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ మారు పేరని మనం గర్వంగా చెప్పుకునేలా ఈ కమిటీల్లో ఆయా వర్గాలకు ప్రాతినిథ్యం ఉండేలా చూడాలని మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయడంతో కమిటీల్లో ఈ వర్గాల వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా..

రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునాయాసంగా గెలిచేందుకు ఈ కమిటీలు కీలకంగా పనిచేయాలని పీసీసీ సూచిస్తోంది. గ్రామ స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తుండడంతో, పార్టీ బలోపేతానికి ఇది సంకేతం కావాలని, రాష్ట్రంలో సంస్థాగతంగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండాలంటే ఇప్పుడు నియమించనున్న ఈ కమిటీలే అత్యంత కీలకమని పీసీసీ భావిస్తోంది. ఈ కమిటీల నియామకం ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకం జరగనుంది. దీంతో సంస్థాగతంగా కాంగ్రెస్ నిర్మాణం పూర్తి కానుంది. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల యుద్ధం ఆరంభం అయ్యే లోపే కాంగ్రెస్ కమిటీల నిర్మాణం పూర్తవుతుదని పీసీసీ
నేతలంటున్నారు.