
- వాసవీ గ్రూప్, క్యాప్స్ గోల్డ్, కలశ ఫైన్స్ జ్వెల్స్‌లో సోదాలు
- హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఏకకాలంలో తనిఖీలు
- హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు చేసిన ఐటీ
- బంగారం బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు గుర్తింపు
- భారీగా నగదు, ఆడిట్ రికార్డులు స్వాధీనం!
హైదరాబాద్, వెలుగు: దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం అమ్మకాలపై ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) డిపార్ట్‌మెంట్ నజర్ పెట్టింది. హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలతో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న బంగారం వివరాలు సేకరిస్తున్నది. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ వ్యాపారులు నిర్వహిస్తున్న లావాదేవీలను పరిశీలిస్తున్నది. ఇందులో భాగంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, అనుబంధ సంస్థలైన క్యాప్స్ గోల్డ్, కలశ ఫైన్ జ్వెల్స్‌లో బుధవారం సోదాలు నిర్వహించింది.
బంజారాహిల్స్‌లోని వాసవీ గ్రూప్ ఆఫ్ కంపనీస్ ఎండీ చందా శ్రీనివాస్ రావు సహా క్యాప్స్ గోల్డ్, కలశ ఫైన్ డైరెక్టర్లు చందా అభిషేక్, చందా సుధీర్, సౌమ్య నివాసాల్లో సోదాలు చేసింది. బెంగళూర్, ముంబై, విజయవాడ, వరంగల్‌లోని కార్పొరేట్ ఆఫీసులు, గోల్డ్ హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో తనిఖీలు చేసింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. గురువారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి.
క్యాప్స్ గోల్డ్, కలశ ఫైన్ జ్వెల్స్ అమ్మకాల్లో అవకతవకలు!
బంజారాహిల్స్, అబిడ్స్ కేంద్రంగా క్యాప్స్ గోల్డ్, కలశ ఫైన్ జ్వెల్స్ సంస్థలు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి గోల్డ్ కొనుగోలు చేస్తుంటాయి. హైదరాబాద్‌లోని హోల్‌సేల్ వ్యాపారులతో పాటు ఏపీ, బెంగళూర్, ముంబైలోని జువెల్లరీ డీలర్లకు పెద్ద మొత్తంలో బంగారం సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ట్యాక్స్‌లు తప్పించుకునేందుకు నగదు రూపంలో లావాదేవీలు జరుపుతున్నట్లు ఐటీ దృష్టికి వచ్చింది.
బంగారం ధరలు రూ. లక్షకు చేరిన తర్వాత గత రెండేండ్లుగా ఐటీ చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు ఐటీ గుర్తించిట్లు సమాచారం. దీంతో పాటు బ్లాక్ మార్కెట్‌లో గోల్డ్ విక్రయాలు చేస్తున్నట్లు ఐటీ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించింది.
సికింద్రాబాద్‌లోని బంగారం వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు
క్యాప్స్ గోల్డ్, కలశ ఫైన్ జ్వెల్స్ కార్పొరేట్ ఆఫీసులు, సికింద్రాబాద్ కళాసిగూడ, బేగంబజార్ సహా ప్రముఖ జువెల్లరీ వ్యాపారుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్, కలశ ఫైన్ జ్వెల్స్‌లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్‌లోని బంగారం వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ సోదాలు చేసింది. జువెల్లరీస్ వ్యాపారి పవన్ వర్మ నివాసంలో సోదాలు చేశారు.
పవన్ వర్మ బంగారం క్రయవిక్రయాలతోపాటు బులియన్ ట్రేడింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రతి సంవత్సరం తిరుపతి బులియన్ పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించి ఐటీ చెల్లింపుల్లో భారీగా వ్యత్యాసం గుర్తించారు. ఈ క్రమంలో పన్నుల చెల్లింపులు, బంగారం క్రయవిక్రయాలు, బంగారం స్టాక్ రిజిస్టర్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.