జూబ్లీహిల్స్లో రూ.15 కోట్లతో పనులు పూర్తి చేశాం.. బస్తీ బాట కార్యక్రమంలో మంత్రి వివేక్

జూబ్లీహిల్స్లో రూ.15 కోట్లతో పనులు పూర్తి చేశాం.. బస్తీ బాట కార్యక్రమంలో  మంత్రి వివేక్

జూబ్లీహిల్స్ లో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. గురువారం (సెప్టెంబర్ 18) జూబ్లీహిల్స్ బస్తీబాట కార్యక్రమంలో భాగంగా రహ్మత్ నగర్ లో ఉదయం  7  గంటలకు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేశారు. రెండు రోజులపాటు ఉండే బస్తీ బాట కార్యక్రమంలో నియోజవకర్గంలోని సమస్యలను తెలుసుని పరిష్కారం చేస్తామని మంత్రి అన్నారు. 

ఉదయం ఏడు గంటలకు మంత్రి వివేక్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో చిరు వ్యాపారులు, స్థానిక మహిళలతో మాటమంతి నిర్వహించారు. టిఫిన్ సెంటర్ లో దోసెలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రహమత్ నగర్ డివిజన్ లో కార్మిక నగర్ నుండి దాదాపు 10  బస్తీలలో పాదయాత్ర చేసామని చెప్పారు. 

ఈ సందర్భంగా స్థానికులు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. నాలల మరమ్మతులు, సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కొన్ని సీసీ రోడ్ల పనులు పూర్తయ్యాయి..మరికొన్ని చోట్ల పనులు సాగుతున్నాయని తెలిపారు. 

గత బీఆర్ ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి స్థానికంగా జరగలేదని స్థానికులు చెబుతున్నారు.. కాళేశ్వరం, మిషన్ భగీరద మొదలైనవి అన్ని కమిషన్ ల కోసం చేసినవేనని వివర్శించారు.  తాను జూబ్లీహిల్స్ ఇంచార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయని.. అన్నిటినీ పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నానని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి చేసే పార్టీ అని అన్నారు మంత్రి వివేక్.  సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు అంటే తప్పరు..హామీలు అన్ని నెరవేరుస్తారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మరో అవకాశం వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.