రాజకీయాలంటేనే సిగ్గేస్తోంది..ఉపన్యాసాలు ఇస్తున్నామే కానీ ఆచరించడం లేదు

రాజకీయాలంటేనే సిగ్గేస్తోంది..ఉపన్యాసాలు ఇస్తున్నామే కానీ ఆచరించడం లేదు
  • భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : ‘ఇప్పుడు రాజకీయమంటే ఏం లేదు... ఖర్చు పెట్టాలి... ఆ ఖర్చును రాబట్టుకోవాలి.. రాజకీయం అంటేనే సిగ్గు పడాల్సి వస్తోంది’ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి, యాదాద్రి కలెక్టర్‌‌‌‌ హనుమంతరావుతో కలిసి బుధవారం భువనగిరి మండలం బొల్లేపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ కోసం రావి నారాయణరెడ్డి ఎంతో పోరాటం చేశారని, పేదల కోసం భూమిని దానం చేసిన ఆదర్శనీయుడని కొనియాడారు. ఆ రోజుల్లో రాజకీయ నాయకులకు మర్యాద ఉండేది, ఇప్పుడు హైప్‌‌‌‌ మాత్రమే ఉందన్నారు.

 ఉపన్యాసాలు ఇస్తున్నామే కానీ ఆచరణలో విఫలమవుతున్నామన్నారు. రావి  నారాయణరెడ్డి వంటి మహానీయులను చూసి ఇప్పటి రాజకీయాల్లో మార్పు కోసం అందరం ప్రయత్నించాలని ఆకాంక్షించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుంటే.. ఒక నాయకుడి ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. 

ఎలాంటి పదవులు వద్దన్న వారే ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అనుభవించారన్నారు. బొల్లేపల్లి గ్రామంలోని స్కూల్‌‌‌‌ అభివృద్ధికి తన ఫండ్స్‌‌‌‌ నుంచి రూ. 15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు 
ఎంపీ ప్రకటించారు.