సిరిసిల్లలో విశ్వకర్మీయుల ఆత్మగౌరవసభను అడ్డుకుంటారా..?

సిరిసిల్లలో విశ్వకర్మీయుల ఆత్మగౌరవసభను అడ్డుకుంటారా..?

తెలంగాణ రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుందా..? లేక కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందా..? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ప్రశ్నించారు. సిరిసిల్లలో ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలనుకున్న విశ్వకర్మ సమావేశానికి అనుమతిని నిరాకరిస్తూ, తమ భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా విశ్వకర్మ సమాజాన్ని మంత్రి కేటీఆర్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పోలీసులు కేటీఆర్ ను మెప్పించడానికి విశ్వకర్మలను సంఘ విద్రోహులుగా ముద్రవేశారని, తమ భావోద్వేగాలతో ఆడుకోవద్దని కోరారు. ‘ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని భరించం’ చలో సిరిసిల్ల విశ్వకర్మీయుల ఆత్మగౌరవసభ అనే కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్ హాల్ లో తలపెట్టారు. అయితే.. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో దాసోజు శ్రావణ్ తప్పుపట్టారు. 

విశ్వకర్మీయుల ఆత్మగౌరవసభను సజావుగా నిర్వహించుకునే వెసులుబాటును సిరిసిల్ల పోలీసులు కల్పించలేరా..? అని దాసోజు శ్రావణ్ ప్రశ్నించారు. విశ్వకర్మలు ప్రొఫెసర్ జయశంకర్ వారసులని, సమాజ అభివృద్ధికి తోడ్పడే ఉత్పాదక శక్తులని చెప్పారు. తమను అణచివేసే ప్రయత్నాలు చేయవద్దని, శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు.

ఇదేం విద్యా వ్యవస్థ..?
రాష్ట్రంలో పేదోళ్లు చదువుకునే ప్రభుత్వ విద్య వ్యవస్థ సర్వనాశనమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీస మానవత్వం లేకుండా విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతారా..? మీరు మీ పిల్లలకు ఇటువంటి భోజనం పెడుతారా..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘నిన్న త్రిబుల్ ఐటీ బాసర, నేడు మహబూబాబాద్ ఆశ్రమ పాఠశాల. ఈ నేరానికి బాధ్యులెవరు..?’ అని ప్రశ్నించారు.